మీదే ఆలస్యం: కార్లపై ఆటో సంస్థల ఆఫర్ల వర్షం.. అప్‌టూ రూ.14 లక్షలు
ఇటు పండుగల సీజన్.. అటు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు.. మరోవైపు ప్రతి వాహనానికి బీమా చేయడం తప్పనిసరి.. ఇక రూపాయి విలువ పతనంతో కుదైలవుతున్న స్టాక్ మార్కెట్లతో మాంద్యం నాటి పరిస్థితులు ఉన్నాయా? అన్న సందేహాలు.
ఇటు పండుగల సీజన్.. అటు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు.. మరోవైపు ప్రతి వాహనానికి బీమా చేయడం తప్పనిసరి.. ఇక రూపాయి విలువ పతనంతో కుదైలవుతున్న స్టాక్ మార్కెట్లతో మాంద్యం నాటి పరిస్థితులు ఉన్నాయా? అన్న సందేహాలు..
కొత్తగా కార్లు, బైక్ లు కొనుగోలు చేయాలని భావించే వారు తమ నిర్ణయాలను వాయిదా వేయడం గానీ.. అసలు కొనాలనే ఆలోచననే విరమిస్తున్న తరుణంలో ఆటోమొబైల్ సంస్థలు ప్రత్యామ్నాయాలు ఆలోచించాయి.
వినియోగదారులకు నూతన వాహనాల విక్రయానికి భారీగా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చాయి. నూతన వాహనాల కొనుగోళ్లకు, అప్ గ్రేడెడ్ వర్షన్ వాహనాల కొనుగోళ్ల కోసమైనా, వాహనాల రీ ప్లేస్ మెంట్ చేసేవారిని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి.
హ్యాచ్ బ్యాక్స్, సెడాన్లు, ఎస్ యూవీ కార్లు ఉత్పత్తి చేస్తున్న మారుతి సుజుకి, హ్యుండాయి, మహీంద్రా, ఫోర్డ్, టాటా మోటార్స్ సంస్థలతోపాటు విలాసవంతమైన కార్ల తయారీ సంస్థలు బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్ బెంజ్ సంస్థలు డిస్కౌంట్లు అందుబాటులోకి తెస్తున్నాయి.
మారుతి సుజుకి ఆల్టో మినీ కారుపై రూ.50 వేలు, మహింద్రా స్కార్పియో ఎస్యూవీ మోడల్ కారుపై రూ.70 వేల ఆఫర్ ప్రకటించాయి. బీఎండబ్ల్యూ -7 సిరీస్ సెలూన్ మోడల్ కారుపై అత్యధికంగా రూ.14 లక్షల వరకు రాయితీ అందుబాటులోకి తెచ్చింది.
క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ విక్రయాలు ఏడు శాతం పెరిగాయి. వినియోగదారుల్లో తగ్గిన సెంటిమెంట్, అధిక ఇంధన ధరలు, వర్షాల ప్రభావం ఆటోమొబైల్ విక్రయాలపై గణనీయంగా ప్రభావం పడిందని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ అధ్యక్షుడు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ సియాం అధిపతి రాజన్ వధేరా వ్యాఖ్యానించారు.
అధిక ధరల పెరుగుదలతో ప్రజలంతా వాహనాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారని రాజన్ వధేరా తెలిపారు. ఇదే సంగతిని హ్యుండాయ్, మారుతి సుజుకి సంస్థల అధికారులు కూడా ధ్రువీకరించారు.
మారుతి సుజుకి అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఇప్పటికీ సెంటిమెంట్ వీక్. ఇంధన ధరలు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పెరిగిన బీమా వ్యయానికి తోడు త్వరలో జరుగనున్న ఎన్నికల ఫలితాలపై నెలకొన్న అనిశ్చితితో కొనుగోలు దారుల మనోభావాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భవిష్యత్‌పై ఆందోళన వాహనాల కొనుగోలు చేసే విషయాన్ని ప్రజలు వాయిదా వేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని చెప్పారు.
హ్యుండాయ్ ఇండియా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వైకే కూ మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం ఆటోమొబైల్ వాహనాల కొనుగోలు ఆరోగ్యకరంగా లేదన్నారు. రూపాయి విలువ పతనంతో తమ వాహనాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వైకే కూ చెప్పారు.
ఇన్ పుట్ వ్యయం మరింత పెరిగిపోయిందన్నారు. దీని ప్రభావంతో అదనపు వ్యయాన్ని వినియోగదారులపై మోపేందుకు సిద్ధంగా లేమని వైకే కూ తెలిపారు. అందునా ప్రస్తుతం పండుగల సీజన్ ఆకర్షణీయమైన రాయితీలతో కూడిన కొనుగోళ్ల టైం అని అన్నారు.
ఈ నెల ఐదో తేదీన ఆర్బీఐ విడుదల చేసిన కన్జూమర్ కాన్ఫిడెన్స్ సర్వే కూడా పరిస్థితి మరింత దారుణంగా మారిందని పేర్కొంది. గ్లోబల్ ఆటోమోటివ్ డేటా అండ్ కన్సల్టెన్సీ సంస్థ జాటో భారత్ అధ్యక్షుడు రవి జీ భాటియా మాట్లాడుతూ గత రెండు నెలలుగా కొన్ని సంస్థల నుంచి ఆర్డర్లు తీసుకునే విషయమై డీలర్లు ఆచితూచి స్పందిస్తున్నారని, ఇది అనారోగ్య వాతావరణం అని పేర్కొన్నారు. అంతా 2019ను మార్పునకు సంకేతంగా భావిస్తూ ఈ ఏడాది కార్ల కొనుగోళ్లకు సిద్ధంగా లేరని తెలిపారు.
ఇండస్ట్రీ బాడీ సియామ్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహనాల విక్రయాల మందగమనమే సాగుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది ప్రారంభంలో వాహనాల కొనుగోలులో 9-11 శాతం పురోగతి ఉంటుందని పేర్కొన్న సియామ్.. తాజా అంచనాలను తగ్గించి వేసింది.
మెర్సిడెజ్ బెంచ్ వంటి విలాసవంతమైన కార్ల కొనుగోలు పట్ల కస్టమర్లలో ఆసక్తి తగ్గుముఖం పట్టిందని సియాం ఆందోళన వ్యక్తం చేసింది. నగదు కొరత నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఆచితూచి స్పందిస్తోంది. ఫలితంగా వ్యాపారులు, సూక్ష్మ, మద్య తరహా పరిశ్రమలకు సరిపడా నిధులు దొరకడం లేదు.
జాతీయ రాజధాని ‘హస్తిన’ నగర వాసులు కూడా అదనపు భారంతో కూడిన కార్ల కొనుగోలుపై ఎందుకు ఖర్చు చేయాలని యోచిస్తున్నారని సియాం పేర్కొంది. స్టాక్ మార్కెట్ల కుదేలు పరిస్థితిని మరింత అధ్వాన్నంగా మార్చేసిందని వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది లోక్ సభకు జరిగే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని సియాం స్పష్టం చేసింది.