న్యూఢిల్లీ: ఉత్పాదకత ఖర్చుల పేరిట ధరలను పెంచే కార్ల జాబితాలో మరో రెండు సంస్థలు చేరాయి. మెర్సిడెస్ బెంజ్ తోపాటు నిస్సాన్ కూడా ధరలు పెంచనున్నట్లు తాజాగా ప్రకటించాయి. జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్లు త్వరలో మరింత ప్రియం కానున్నాయి. ఈ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ తన వివిధ మోడళ్ల కార్ల ధరను పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు శాతం మేరకు ధరలు పెంచుతున్నట్లు తెలిపింది.

సంస్థ ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల మోడల్ కార్ల స్థాయికనుగుణంగా ఈ ధరలు పెంచుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. తయారీ ఖర్చులు పెరిగి పోవడంతో కంపెనీపై పెను ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధరలు పెంచక తప్పడం లేదని తెలిపింది.

గత కొంతకాలంగా సంస్థ ఉత్పత్తులపై అవుతున్న ఉత్పాదక ఖర్చులను సమీక్షిస్తున్నట్లు సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ షీ వెంక్ చెప్పారు. పెరుగుతున్న ఉత్పాదకత ఖర్చులు సంస్థపై ప్రభావం చూపుతున్నాయన్నారు.

పెరుగుతున్న ఖర్చులను అధిగమించడానికి దిద్దుబాటు చర్యల్లో భాగంగా స్వల్పంగా ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు. దీంతో తమ ఉత్పత్తులపై మూడు శాతం వరకు ధర పెంచాలని నిర్ణయించాం అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ షీవెంక్ తెలిపారు. 

వరుసగా వాహన కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. నిస్సాన్ తన వాహన ధరలను ఐదు శాతం వరకు పెంచనున్నది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో నిస్సాన్, డాట్సన్ బ్రాండ్‌తో విక్రయిస్తున్న అన్ని రకాల వాహనాలు వచ్చే నెల 1 నుంచి మరింత ప్రియంకానున్నాయి. 

ప్రస్తుతం మార్కెట్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా వాహనాలపై రేట్లను పెంచినట్లు నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇదివరకే మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్‌, కియా మోటార్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.