Asianet News TeluguAsianet News Telugu

ఎందుకిలా?: సింగిల్ డిజిట్‌కే కార్ల విక్రయాలు

భద్రత ప్రమాణాల నేపథ్యంలో బీమా ప్రీమియం పెంచేయడంతో కార్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పండుగల సీజన్‌లో 14 శాతం పతనమయ్యాయి. ఇది గత ఐదేళ్లలో అత్యంత దారుణ పరిస్థితికి అద్ధం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 

Car sales growth to remain flat in FY 2019
Author
New Delhi, First Published Feb 1, 2019, 12:56 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాల విక్రయాలు కేవలం సింగిల్ డిజిట్స్‌కు మాత్రమే పరిమితమయ్యాయని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 31 లక్షల కార్ల లక్ష్యాన్ని మాత్రమే చేరుకోగలవేమోనని గణాంకాలు చెబుతున్నాయి.

భారీ వరదలకు తోడు బీమా ఫీజు చెల్లింపు.. వడ్డీరేట్ల పెంపు, ఇంధన ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పండుగల సీజన్ సేల్స్‌ను గణనీయంగా దెబ్బతీశాయి. 2017తో పోలిస్తే 2018 పండుగ సీజన్ విక్రయాలు సుమారు 30 శాతం తగ్గాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - డిసెంబర్ మధ్య సేల్స్ 23,72,062 యూనిట్లకు చేరాయి. గత జనవరి - మార్చి త్రైమాసికంలో మాత్రమే సగటున 2.5 లక్షల కార్లు అమ్ముడు పోయాయి. కానీ దేశీయంగా కార్ల విక్రయం వార్షిక ప్రాతిపదికన చూస్తే 0.85 శాతం పురోగతి మాత్రమే కనిపిస్తున్నది.

దీని ప్రభావం మరికొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉన్నదని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్వీటీస్ అనలిస్టులు చెబుతున్నారు. హోండా కార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాజేశ్ గోయల్ మాట్లాడుతూ ద్వితీయ, త్రుతీయ త్రైమాసికాల్లో వాహనాల విక్రయ పురోగతి సింగిల్ డిజిట్స్ కే పరిమితం అవుతుందని అంచనా వేశామన్నారు.

మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ మాట్లాడుతూ తమ డిసెంబర్ రిటైల్ సేల్స్‌తో వార్షిక ప్రాతిపదికన ఆరు శాతం సేల్స్ సాధించగలిగామన్నారు. అయితే మొత్తం కార్ల పరిశ్రమ పరిస్థితిపై స్పందించబోనని పేర్కొన్నారు. కానీ 2016-17తో పోలిస్తే  2017-18 ఏప్రిల్ - డిసెంబర్ నెలల మధ్య దేశీయంగా కార్ల విక్రయాలు ఏడు శాతం పెరుగడం గమనార్హం. 

2018 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య ప్రయాణికుల కార్ల విక్రయాలు సగానికి పడిపోయి 4.37 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. జూలై నుంచి ప్రత్యేకించి కార్ల విక్రయాలు తగ్గాయి. బీమా ప్రీమియం, ఫైనాన్స్ వ్యయం పెరుగడమే దీనికి కారణం. దీనికి తోడు కార్ల ధరలు కూడా రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు పెరుగడం గమనార్హం. అది ఆయా మోడల్ కార్ల ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి కూడా ధరలు పెరిగాయి. 

ఉదాహరణకు మారుతి ఆల్టో 800 కార్లపై ఏడాది బీమా వ్యయం రూ.10,452తోపాటు మరో రూ.7000 చెల్లించాల్సి ఉంటుంది. హ్యుండాయ్ క్రెట్టా ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీకి పైగా ఉండటంతో ఒక ఏడాదికే బీమా వ్యయం రూ.23,845 నుంచి రూ.45,407లకు చేరిపోయింది. 

జూలైకి ముందు అంటే ఏప్రిల్- జూన్ మధ్య కార్ల విక్రయాలు 20 శాతం పెరిగాయి. జూలై నుంచి బీమా వ్యయం నిబంధనలు అమల్లోకి రావడంతో సేల్స్ మూడు శాతం పడిపోయాయి. ఫెస్టివ్ డిమాండ్ బాగా ఉంటుందని హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్లు స్టాక్ 1.55 శాతం పెంచుకున్నా.. నవంబర్, డిసెంబర్ నెలల్లో కార్ల విక్రయాలు సుమారు మూడు శాతం తగ్గిపోయాయి. 

గత ఐదేళ్లలో ఫెస్టివ్ సీజన్ కార్ల విక్రయాలు అత్యంత దారుణంగా తగ్గిపోవడం ఇదే మొదటిసారని విశ్లేషకులు చెబుతున్నారు. దీపావళి ముగిసి నాటికి 42 రోజుల ఫెస్టివ్ సీజన్‌లో విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 14 శాతం పడిపోయాయని సియాం అధ్యక్షుడు రాజన్ వాధెరా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంపైనే తాము ఆశలు పెట్టుకున్నామన్నారాయన. 
 

Follow Us:
Download App:
  • android
  • ios