హైదరాబాద్‌: ఇటలీకి చెందిన సూపర్‌ బైక్‌ల బ్రాండ్‌ బెనెల్లీ సంస్థ హైదరాబాద్‌లో తయారీ యూనిట్‌ను సైతం ప్రారంభించే యోచనలో ఉంది. బెనెల్లీ ఇండియా ఇప్పటికే మేడ్చల్‌ వద్ద ఏటా 5,000 బైక్‌లను అసెంబ్లింగ్‌ చేయగల యూనిట్‌ను ఏర్పాటు చేసింది. 

వచ్చే రెండేళ్లలో అసెంబ్లింగ్‌ సామర్థ్యం 45వేల యూనిట్లకు పెంచాలనుకుంటున్నట్లు బెనెల్లీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ జబక్‌ తెలిపారు. అసెంబ్లింగ్‌ యూనిట్‌లో సామర్థ్యం పూర్తి స్థాయికి చేరుకున్నాక బైక్‌ల మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్‌ను సైతం ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. ఇందుకు కనీసం 25 ఎకరాల స్థలం, రూ.100 కోట్ల మేర పెట్టుబడి అవసరం కావచ్చన్నారు.

సీకేడీ రూట్‌లో హైదరాబాద్‌లో బైక్స్ అసెంబ్లీంగ్ చేస్తున్న బెనెల్లీ ఈ ఏడాది ఐదు మోడల్ బైక్స్ అసెంబ్లీంగ్ చేయాలని ప్రతిపాదించింది. గత జనవరి నుంచి మేడ్చల్ అసెంబ్లింగ్ యూనిట్‌లో మోటారు సైకిళ్ల అసెంబ్లింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
 
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే చర్చిస్తున్నట్లు బెనెల్లీ ఇండియా ఎండీ వికాస్ జబక్‌ తెలిపారు. మహావీర్‌ గ్రూప్‌నకు చెందిన ఆదీశ్వర్‌ ఆటోరైడ్‌ ఇండియా కంపెనీ బెనెల్లీ బైక్‌ల డీలర్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా బెనెల్లీ షోరూమ్‌ను కూకట్‌పల్లి జాతీయ రహదారిపై మెట్రోషాపింగ్‌ మాల్‌ ఎదురుగా ఏర్పాటు చేసింది. గతంలో ఈ షోరూమ్‌ బంజారాహిల్స్‌లో ఉండేది.

తాజాగా భారత్ విపణిలోకి 250 సీసీ ఎంట్రీ సెగ్మెంట్ మోటార్ సైకిల్ మొదలు 750 సీసీ సామర్థ్యం గల సూపర్ బైక్‌ మధ్య నాలుగు బైకులను ఆవిష్కరించేందుకు బెనెల్లీ కసరత్తు చేస్తోంది. చైనాకు చెందిన క్విజియాన్ జియాంగ్ గ్రూప్‌తో కలిసి ముందుకు సాగుతున్నది బెనెల్లీ. 

బెనెల్లీ నెట్ వర్క్ పరిదిలో ప్రస్తుతం ఉన్న 19 డీలర్ షిప్ సంస్థలను ఈ ఏడాదిలో 40కి పెంచాలని నిర్ణయించుకున్నది. సర్వీసింగ్ ఫెసిలిటీ కూడా కల్పించబోతోంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కనీసం రెండు మోడల్ బైక్స్ ధరలను రూ.60 వేల వరకు తగ్గించి వేసింది. 

త్వరలో 500 సీసీ సామర్థ్యం గల లియోన్సినో, 400 సీసీ సామర్థ్యం గల ఇంపెరయాల్ ఉన్నాయి. వీటిని బుల్లెట్, జావా సెగ్మెంట్ బైక్స్ మాదిరిగా నడుపాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి బీఎస్ -6 నిబంధనలకు అనుగుణంగా బైక్స్ తయారీ చేపడతామని బెనెల్లీ తెలిపింది. అయితే కొన్ని బైక్స్ ధరలు పెంచక తప్పకపోవచ్చు.