న్యూఢిల్లీ: కొత్త బైక్‌ పల్సర్‌ 125 నియోను బజాజ్‌ ఆటో మంగళవారం ఆవిష్కరించింది. 125 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ డ్రమ్‌ / డిస్క్‌ బ్రేక్‌లతో లభిస్తుందని సంస్థ తెలిపింది. డ్రమ్‌ బైక్‌ ధర రూ.64,000 కాగా, డిస్క్‌ బ్రేక్‌ రూ.66,618గా నిర్ణయించింది. ఈ ప్రీమియం స్పోర్టీ మోటారు సైకిళ్లు చక్కని స్టైల్‌తో అసాధారణమైన పెర్ఫార్మెన్స్‌ కలిగి ఉంటాయి. 

ఈ మోటార్‌సైకిల్‌ను డిజైన్‌, ధరల పరంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ సారంగ్‌ కనాడే తెలిపారు. 5 గేర్‌లు కల ఈ బైక్‌కు ప్రైమరీ కిక్‌ ఉంటుంది. బజాజ్ పల్సర్ మూడు రంగులు.. సోలార్ రెడ్, నియాన్ బ్లూ, ప్లాటినం సిల్వర్‌ల్లో లభిస్తుంది. బజాజ్ పల్సర్ 125 సీసీ నియో ఆవిష్కరణపై మేం ఆసక్తితో ఉన్నామని సారంగ్ కనాడే తెలిపారు. 

పల్సర్ 125 నియో బైక్ 125 సీసీ, డీటీఎస్-ఐ ఇంజిన్‌తో గరిష్ఠంగా 8,500 ఆర్పీఎంతో 11.8 బీహెచ్పీ, 6,500 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్చ్ వెలువరిస్తుంది. కౌంటర్ బ్యాలెన్స్డ్ ఇంజిన్ బండి నడిపేందుకు స్మూత్‌గా ఉంటుంది. క్లచ్ డిప్రెషింగ్ చేస్తే చాలు ఏ గైర్ పైనైనా దూసుకెళ్లొచ్చు. 

నూతన సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా కంబైండ్ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్), యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) కలిగి ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి టూ వీలర్స్ కూడా బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా టెక్నాలజీని అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల బైక్‌ల ధరలు పెరిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు.