న్యూఢిల్లీ: ఒకనాడు టూ వీలర్ మార్కెట్‌ను రారాజులా ఏలిన బజాజ్ చేతక్ స్కూటర్ మళ్లీ రంగ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధమైంది. నూతనంగా మార్కెట్లోకి చేతక్‌ స్కూటర్‌ను తీసుకొస్తున్న బజాజ్‌ ఆటో నేటి అవసరాలకు అనుగుణంగా పర్యావరణహితంగా దీన్ని రూపొందించారు. చూడగానే ఆకట్టుకునేలా సరికొత్త రూపంతో ఎలక్ట్రిక్‌ వాహనంగా చేతక్‌ వినియోగదారుల ముందుకు రానున్నది. 

also read బజాజ్ ఈజ్ బ్యాక్.. న్యూ లుక్‌తో విపణిలోకి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

పుణెలోని చకన్ ప్లాంట్‌లో తయారు చేయనున్న ఈ బైక్ జనవరిలో విపణిలోకి రానున్నది. ముందు పుణెలో ఆ తర్వాత బెంగళూరులో విక్రయాలు ప్రారంభిస్తారు. తొలుత దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన తర్వాత యూరప్ మార్కెట్లకు ఎగుమతి చేయాలని బజాజ్ ఆటో సంకల్పించింది. 

ఎలక్ట్రిక్‌ వాహనంగా తయారైన కొత్త చేతక్‌లో 4కేవీ ఎలక్ట్రిక్‌ మోటర్‌తో పాటు ఐపీ67 రేటింగ్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీ అమర్చారు. విద్యుత్ వినియోగ వాహనాలను కొనేటప్పుడు రేంజ్‌ (మైలేజీ) గురించి అడుగుతారు. చేతక్‌ ఎకానమీ మోడ్‌లో 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్‌ మోడ్‌లో 85 కిలోమీటర్ల రేంజ్‌ వరకు నడుస్తుంది.

లోహపు బ్యాడీతో ఆకర్షణీయంగా ముస్తాబైన బజాబ్‌ చేతక్‌ ఆరు రంగుల్లో లభ్యం కానున్నది. డిజిటల్‌ కన్‌సోల్‌, గుర్రపునాడ ఆకారంలో డీఆర్‌ఎల్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, ఎల్‌ఈడీ బ్లింకర్లు ఉన్నాయి. ఇంటిలిజెంట్ బ్యాటరీ మేనేజ్మెంట్ వ్యవస్థను అమర్చడంతో అది బ్యాటరీని నియంత్రిస్తూ ఉంటుంది.

వేగాన్ని సులువుగా నియంత్రించేలా రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ సిస్టం నూతన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం. దీనికి 12 అంగులాల చక్రాలు అమర్చారు. ముందు చక్రానికి డిస్క్‌ బ్రేక్‌ ఉంది. బజాజ్‌ బ్యాడ్జ్‌(లోగో) మాత్రం లేదు. కొత్త చేతక్‌ ధర రూ. 90 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది.

also read  మళ్లీ మార్కెట్లోకి బజాజ్ చేతక్‌... సరికొత్తగా

ఈ స్కూటర్‌లో రీ జనరేటింగ్ పవర్ ఉంది. చేతక్ బ్యాడ్జితో తయారవుతున్న ఈ స్కూటర్ సరికొత్త చూపులతో పూర్తి రెట్రో స్టైల్‌లో రూపొందించారు. ఆప్రాన్ నుంచి టెయిల్ లైట్ వరకు మంచి ఫినిషింగ్‌తో తయారవుతున్న ఈ స్కూటర్‌లో ఫెదర్ టచ్ యాక్టివేటెడ్ ఎలక్ట్రానిక్ స్విచ్‌లు దీనికి మరింత ఆకర్షణ తీసుకు రానున్నాయి. మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో రూపుదిద్దుకోనున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రానున్నది.