న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగం రెండు, మూడు సంవత్సరాలుగా అమ్మకాలు సరిగ్గా లేక దిగాలు పడుతూనే ఉన్నది. పండుగల సీజన్‌లోనైనా సేల్స్ భారీగా ఉంటాయని భారీగా పెట్టుకున్న ఆశలు అంతగా నెరవేరలేదని గణాంకాలు చెబుతున్నాయి. కమర్షియల్, ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే భారీగా తగ్గాయి. భవిష్యత్ అవకాశాలపైనా స్తబ్దత నెలకొని ఉండటం గమనార్హం.

మారుతి సుజుకి, రెనాల్ట్ మినహా దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుండాయ్ మోటార్స్, హోండా కార్స్, అశోక్ లేలాండ్ సేల్స్‌లో మూడు నుంచి 30 శాతం వరకు పడిపోయాయి. విక్రయాలను పెంచుకునేందుకు సదరు సంస్థలు భారీగా డిస్కౌంట్లను ప్రకటించినా లాభం లేకుండా పోయింది.

గతేడాది నవరాత్రి, విజయదశమి మాత్రమే అక్టోబర్ నెలలో రాగా, దన్‌తేరాస్, దీపావళి పండుగలు నవంబర్ నెలలో వచ్చాయి. కానీ ఈ ఏడాది నవరాత్రి, విజయదశమి, దన్ తేరాస్, దీపావళి పండుగలన్నీ అక్టోబర్ నెలలోనే వచ్చేయడంతో ఆటోమొబైల్ సంస్థలు అమ్మకాలపై ఆశలు పెట్టుకున్నాయి. కానీ అక్టోబర్ నెల విక్రయాలతో భవిష్యత్‌లోనూ గిరాకీ ఉండక పోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వల్పకాలంలోనైనా ఈ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

కర్బన ఉద్గారాల నియంత్రణకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి భారత స్టాండర్డ్ -6 స్థాయి వాహనాలనే ఆటోమొబైల్ సంస్థలు అమ్మాల్సి ఉండటం గమనార్హం. దీనికి తోడు డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోవడంతోపాటు రవాణా రంగ పరిణామాలపై అనిశ్చితి నెలకొనడం అన్నింటిని మించి వినియోగదారుడి సెంటిమెంట్ బలహీనపడటం వల్ల అక్టోబర్ సేల్స్ మీద ప్రభావం పడింది.

పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2021 వరకు ఆటోమొబైల్ అమ్మకాలు ఇలాగే సాగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2021 ప్రారంభం నుంచి కాసింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిల్వల విక్రయానికి కంపెనీలు రిటైల్ విక్రయాలపై ద్రుష్టిని సారిస్తాయని చెబుతున్నారు.

బీఎస్-6 ప్రమాణాల గడువు దగ్గరకు పడినా కొద్దీ నిల్వల విక్రయాలకు హడావుడి పడేకన్నా.. ఇప్పటి నుంచే నిల్వలు తగ్గించుకుంటే మేలని చెబుతున్నారు. ఇందుకోసం ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి ఆటోమొబైల్ సంస్థలు.

ఇదిలా ఉంటే వాణిజ్య వాహనాల విక్రయాలపైనా అక్టోబర్ నెలలో ప్రభావం పడటం ఆందోళనకరమైన అంశమే. అక్టోబర్ నెలలో దేశీయంగా టాటా మోటార్స్ విక్రయాలు 34 శాతం తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 3.2 శాతం, అశోకే్ లేలాండ్ అమ్మకాలు 36.7 శాతం, ఐషర్ మోటార్స్ హోల్ సేల్ విక్రయాలు 35.4 శాతం పడిపోయాయి. వాణిజ్య వాహనాల తయారీ కంపెనీలన్నీ విశ్లేషకుల అంచనాలకు అందుకోలేకపోయాయన్న విమర్శ ఉంది. 

అయితే ఆటోమొబైల్ సంస్థలన్నీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయని, ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు పెంచడం వల్ల మున్ముందు విక్రయాలు పెరుగుతాయని టాటా మోటార్స్ చెబుతోంది.