Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్-19 ఎఫెక్ట్: లాక్ డౌన్లతో ఆటోమొబైల్ ప్రొడక్షన్ నిలిపివేత

ప్రభుత్వ విధానాలతో దేశంలో నెలకొన్న మాంద్యం దెబ్బతో ఇప్పటికే అమ్మకాలు లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న వాహన పరిశ్రమపై కరోనా పిడుగు ఆ రంగాన్ని మరింత కుదేలు చేస్తోంది

Auto majors suspend operations
Author
New Delhi, First Published Mar 23, 2020, 11:00 AM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలతో దేశంలో నెలకొన్న మాంద్యం దెబ్బతో ఇప్పటికే అమ్మకాలు లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న వాహన పరిశ్రమపై కరోనా పిడుగు ఆ రంగాన్ని మరింత కుదేలు చేస్తోంది. ప్రజల కొనుగోళు శక్తి హరించుకుపోవడంతో మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోవడం మరోవైపు వైరస్‌ భయాల నేపథ్యంలో పలు వాహన కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి. 

ఇప్పటికే ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్‌ ఆటో మహారాష్ట్రలోని చక్కన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపి వేయాలని నిర్ణయించింది. టాటా మోటార్స్‌ పుణె ప్లాంట్‌లో ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది. 

ఇదే బాటలో మరిన్ని వాహన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అమ్మకాలు లేక గత కొన్ని నెలలుగా మారుతి సుజుకి లాంటి పెద్ద కంపెనీలు ఉత్పత్తిలో కోత విధించుకుంటూ వస్తోన్నాయి. ఇలాంటి పరిణామాలతో ఈ రంగంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.

దీనికి తోడు కరోనా భయాలతో ఆ రంగంపై ఆధారపడిన వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదు కావడంతో అక్కడి పరిశ్రమల కార్యకలాపాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 

బజాజ్‌ ఆటో తన చక్కన్‌ ఫ్యాక్టరీ మూసివేయడంతోపాటు కార్పొరేట్‌ ఆఫీసు కార్యకలాపాలను నిలిసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కరోనా భయాలకు వాహన పరిశ్రమలో మూసివేసిన తొలి కంపెనీగా నిలిచింది. 

పుణె ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ గత ఫిబ్రవరిలోనే అంతర్జాతీయ ప్రయాణాలను రద్దు చేసినట్టు బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ శర్మ తెలిపారు. మార్చి ప్రారంభంలోనే తమ సిబ్బందికి ఇంటి వద్ద నుంచి పని చేసే సౌలభ్యం కల్పించామన్నారు. 

మహీంద్రా అండ్ మహీంద్రా కూడా మహరాష్ట్రలోని నాగ్ పూర్, చకన్ (పుణె), కండ్లీవాలీ (ముంబై)ల్లోని ఉత్పాదక యూనిట్లలో సోమవారం నుంచి ప్రొడక్షన్ నిలిపివేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా సిబ్బంది ‘వర్క్ ఫ్రం హోం’ కింద పని చేస్తున్నారు. దేశంలోని సంస్థలో సామాజిక దూరం పాటించాలన్న నిబంధనను పాటిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ భారతదేశంతోపాటు వివిధ దేశాల్లోని ఉత్పాదక యూనిట్లలో ప్రొడక్షన్ నిలిపివేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటలనో తెలిపింది. కొలంబియా, బంగ్లాదేశ్, నీమ్ రాణాల్లోని గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌ కూడా మార్చి 31 వరకూ మూసివేస్తున్నట్లు వెల్లడించింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ యూనిట్ లోని సిబ్బంది ఇంటి వద్ద నుంచే పని చేయాలని సూచించింది. 

also read:ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ: కరోనాపై సమరం.. రంగంలోకి ఆర్బీఐ ‘వార్ రూమ్‌’!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫియట్ ఇండియా కూడా మహారాష్ట్రలోని రంజన్ గావ్ ప్లాంట్ నుంచి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో కరోనా విజృంభించడంతో ముంబయి, నాగ్‌పూర్‌, పూణె, పింప్రి-చించువాడ్‌ పారిశ్రామిక తదితర కీలక ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించారు.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ తన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ప్రొడక్షన్ యూనిట్లలో ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు తాత్కాలిక ఉత్పత్తిని నిలిపివేసింది. హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) దేశంలోని నాలుగు ఉత్పాదక కేంద్రాల్లో బైక్స్, స్కూటర్ల ఉత్పత్తిని నిలిపివేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios