ముంబై: దేశంలోనే అతిపెద్ద టైర్ల పరిశ్రమ అపోలో టైర్ల కంపెనీ చైర్మన్ ఒంకార్ కన్వర్, ఆయన కుమారుడు- సంస్థ ఎండీ, కంపెనీ ఉపాధ్యక్షుడు నీరజ్ కన్వర్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీ తమదేనని ఇష్టా రాజ్యంగా వేతనాలు నిర్ణయించుకుని తీసేసుకోవడం కుదరదని సంస్థ వాటా దారులు తేల్చేశారు. అంతే కాదు సంస్థ ఎండీగా రెండోసారి నీరజ్ కన్వర్‌ను కొనసాగించేందుకు అంగీకరించలేదు. 

పోటీ ప్రపంచంలో ఎక్కడైనా పెర్పార్మెన్స్ ఆధారంగానే వేతనాలు, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి. అందునా కార్పొరేట్ వరల్డ్‌లో పెర్ఫార్మెన్స్‌కే పెద్దపీట. కానీ 2016లో రూ.30 కోట్లు హౌజ్ అలవెన్స్‌గా తీసుకున్న నీరజ్ 2017లో ఆయన నిర్వహణలో కంపెనీ లాభాలు 34 శాతం తగ్గి రు.622 కోట్లకే పరిమితం అయ్యాయి. 

కానీ నీరజ్ కన్వర్ హౌజ్ అలవెన్స్ 41 శాతం పెంపుతో 42.8 కోట్లను డ్రా చేశారు. దీంతో పే-టు-లాభం నిష్పత్తి పరంగా నీరజ్‌కు అందినపరిహారం దాదాపు రెట్టింపైంది. అలాగే గత ఆర్థిక సంవత్సరానికి తండ్రీకొడుకుల జీతం-లాభం నిష్పత్తి రెండింతలైందిట. ఇదే షేర్ హోల్డర్లలో నీరజ్ కన్వర్‌పై అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అపోలో టైర్స్ ఎండీ నీరజ్ కన్వర్ కొనసాగింపునకు కంపెనీలో మైనార్టీ వాటా కలిగిన షేర్ హోల్డర్స్ ససేమిరా అన్నారు. ఈ షాకింగ్‌ పరిణామంతో కంపెనీలో మేజర్ వాటా కలిగిన నీరజ్ కన్వర్‌కు షేర్‌ హోల్డర్ల చేతిలో అతి పెద్ద ఒటమి ఎదురైనట్టైంది. 

నీరజ్ వాడుకోవాల్సిన దానికంటే ఎక్కువ పరిహారాలను తీసుకున్నారని, ఈ నేపథ్యంలో ఆయన ఎండీగా కొనసాగడానికి అర్హుడు కాదని అపోలో టైర్స్  షేర్ హోల్డర్లు అభిప్రాయ పడ్డారు. సెప్టెంబర్ 12న జరిగిన ఓటింగ్ లో కంపెనీ సంస్థాగత మదుపర్లు, మ్యూచువల్ ఫండ్‌ ఇన్వెస్టర్లు కూడా నీరజ్ కన్వర్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఈ నేపథ్యంలో కంపెనీ వీరికి చెల్లించే వేతన చెల్లింపుల్లో 30 శాతం కోత పెడుతూ ప్యానెల్ సూచనలు చేసింది. అలాగే  మేనేజింగ్ డైరెక్టర్‌గా నీరజ్ పునః నియామకాన్ని కూడా కంపెనీ  తిరస్కరించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వారికి ఇచ్చే మొత్తం పరిహారాన్ని 30 శాతం తగ్గించాలని అపోలో టైర్స్ బోర్డు నామినేషన్స్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ ప్రతిపాదించింది.

ప్రమోటర్ల వేతనాలు పన్ను చెల్లించే ముందు లాభంలో 7.5 శాతం పరిమితి ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. పనితీరు ఆధారిత వేతనం మొత్తం పరిహారంలో సుమారు 70 శాతంగా ఉండాలి, ప్రమోటర్ల వార్షిక ఇంక్రిమెంట్లు కూడా కంపెనీ సీనియర్ నిపుణులకి అనుగుణంగా ఉండాలని ప్యానెల్‌ స్పష్టం చేసింది.