Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లోకి బజాజ్‌ కొత్త ప్లాటినా 110.. అటు జాగ్వార్ పొదుపు మంత్రం

బజాజ్ ఆటోమొబైల్ తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నది. తాజాగా ‘ప్లాటినా 110’ పేరిట నూతన బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరోవైపు డీజిల్ వేరియంట్లకు కొరవడిన మద్దతు, చైనాలో తగ్గిన విక్రయాలు, బ్రెగ్జిట్ భయాల మధ్య జాగ్వార్ లాండ్ రోవర్ నష్టాలు చవి చూసింది. ఈ క్రమంలో పొదుపు చర్యలు చేపట్టిన జాగ్వార్ లాండ్ రోవర్ నూతన వసంతం ప్రారంభంలో 5000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నది. 

All New Bajaj Platina 110 Launched
Author
Delhi, First Published Dec 18, 2018, 10:34 AM IST

రెండు వర్షన్లలో బజాజ్ ప్లాటినా 110 లభ్యం
కొత్త ప్లాటినా 100 మోడల్‌ ఎబోనీ బ్లాక్‌, కాక్‌టైల్‌ వైన్‌ రెడ్‌ రంగుల్లో లభించనున్నది. బజాజ్‌ ఆటో మోటార్ సైకిళ్ల బిజినెస్ అధ్యక్షుడు ఎరిక్‌ వాస్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘విజయవంతమైన ప్లాటినా 100 ఈఎస్‌ సరసన ప్లాటినా 110 మోడల్‌ చేరనున్నది.

100 సీసీ వినియోగదారులకు కొత్త బైకు ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది’ అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బజాజ్‌ షోరూమ్‌ల్లో ఈ నూతన మోడల్ మోటార్ సైకిల్ లభిస్తుందని ఎరిక్ వాస్ తెలిపారు.

టాటా మోటార్స్‌లో పొదుపు ప్రణాళిక: జేఎల్‌ఆర్‌లో 5000 ఉద్యోగాల కోత!
టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) నూతన వసంతం ప్రారంభంలో భారీగా ఉద్యోగాల కోత విధించడానికి సిద్ధమవుతోంది. 2.5 బిలియన్‌ పౌండ్ల (దాదాపు రూ.22,000 కోట్లు) విలువైన వ్యయం తగ్గింపునకు ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా 5000 మంది వరకు ఉద్యోగులను తొలగించడానికి సన్నాహాలు చేస్తోంది. 

జేఎల్ఆర్‌లో 40 వేల ఉద్యోగాలు
బ్రిటన్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్‌)కు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. డీజిల్‌ కార్లకు తగ్గిన గిరాకీ, చైనాలో క్షీణించిన అమ్మకాలు,  యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి బ్రిటన్‌ సిద్ధమవుతున్న నేపథ్యంలో జేఎల్‌ఆర్‌ ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది.

సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 90 మిలియన్‌ పౌండ్ల నష్టం చవిచూసింది. దీంతో కంపెనీ మూడేళ్ల వ్యయ నియంత్రణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల తొలగింపు ప్రణాళికలపై స్పందించేందుకు జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు.

చైనా సహా కీలక మార్కెట్లలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు నెమ్మదించడంతో మాతృసంస్థ టాటా మోటార్స్‌ దీర్ఘకాల రేటింగ్‌లో ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ కోత విధించిన విషయం తెలిసిందే. అయిదు నెలల్లో టాటా మోటార్స్‌ రేటింగ్‌ తగ్గించడం ఇది రెండో సారి.

Follow Us:
Download App:
  • android
  • ios