Asianet News TeluguAsianet News Telugu

తగ్గిన ఫారిన్ మోజు! సేల్స్ కదలని కొత్తకార్లు!!

అంతర్జాతీయంగా అతిపెద్ద మార్కెట్ గల దేశం మనది. కానీ అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా తలెత్తిన సమస్యల పుణ్యమా? అని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్ల కొనుగోళ్లు భారీగా పడిపోయాయని ఇండస్ట్రీ బాడీ సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది. 

9 out of 17 mass market PV makers witness sales decline in April-October
Author
Delhi, First Published Nov 12, 2018, 2:08 PM IST

భారత్‌పై భారీ ఆశలు పెట్టుకున్న అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలకు నిరాశే ఎదురైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో 17 సంస్థల్లో తొమ్మిదింటి విక్రయాలు తగ్గుముఖం పట్టాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) వెల్లడించింది. అంతర్జాతీయ బ్రాండులైన ఫోక్స్‌వ్యాగెన్, రెనో నిస్సాన్, స్కోడాలకు గట్టి షాక్ తగిలింది.

ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఫోక్స్‌వ్యాగెన్ అమ్మకాలు 24.28 శాతం క్షీణించి 21,367 యూనిట్లకు పడిపోగా, రెనో విక్రయాలు కూడా 26.17 శాతం తగ్గి 47,064 యూనిట్లకు పరిమితమైంది. నిస్సాన్ మోటార్స్ 22,905 యూనిట్లను విక్రయించింది.

గతేడాది ఇదే సమయంలో అమ్మిన వాహనాలతో పోలిస్తే 26.81 శాతం పతనమయ్యాయి. అలాగే స్కోడా అమ్మకాలు కూడా ఏడాది ప్రాతిపదికన 1.48 శాతం క్షీణించి 9,919 లకు, ఇసూజు మోటార్స్ 18.32 శాతం జారుకొని 1,248 పరిమితమయ్యాయి. ఫియట్ కేవలం 481 కార్లనే విక్రయించడం గమనార్హం. 

సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగాటో సేన్ మాట్లాడుతూ అమ్మకాల్లో ఎదురుదెబ్బలు తగిలిన అంతర్జాతీయ సంస్థలు ఇతర దేశాలపై దృష్టి సారించాయని, ఇందుకోసం ఇతర సంస్థలతో జతకట్టాయని చెప్పారు. వీటిలో ఫోర్డ్ ఇండియా, మహీంద్రాతో జతకట్టగా, టయోటా-సుజుకీలు తమ ఒప్పందాన్ని ప్రకటించాయి కూడా.

గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో అమ్మకాలు కొనసాగించిన జనరల్ మోటార్స్ ఎలాంటి పురోగతి సాధించలేకపోవడంతో పూర్తిగా విక్రయాలను నిలిపి వేస్తున్నట్లు గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే.

దేశీయ ఆటోమొబైల్ సంస్థల్లో ఫోర్స్ మోటార్ 1,246 యూనిట్లు (మైనస్ 16. 88 శాతం), మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ 333 యూనిట్లకు (32.04 శాతం పతనం), మిత్సుబిషికి చెందిన ఎస్‌యూవీలను విక్రయిస్తున్న హిందూస్థాన్ మోటార్ ఫైనాన్స్ అమ్మకాలు కూడా 44. 57 శాతం తగ్గి 189 యూనిట్లకు పరిమితమైనట్లు సియామ్ తెలిపింది.

మరోవైపు ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 9.1 శాతం పెరిగి 10,44, 749యూనిట్లకు చేరుకోగా, హ్యుందాయ్ మోటార్ విక్రయాలు 3.86 శాతం పెరిగి 3,26,178 లకు, మహీంద్రా అండ్ మహీంద్రా స్వల్పంగా పెరిగి 1,45,462లను విక్రయించింది.

వీటితోపాటు టాటా మోటార్స్ 25.65 శాతం పెరిగి 1,38, 732లకు, హోండా కార్స్ 2.98 శాతం ఎగబాకి 1,08,652, టయోటా కిర్లోస్కర్ 14.69 శాతం ఎగబాకి 92,169 యూనిట్లను ఇప్పటి వరకు విక్రయించాయి. అలాగే ఫోర్డ్ ఇండియా సేల్స్ 15.5 శాతం పెరిగి 58,082 యూనిట్లకు చేరుకోగా, ఎఫ్సీఏ ఇండియా ఆటోమోబైల్స్ విక్రయాల్లో 28.99 శాతం పురోగతితో 9,753 యూనిట్లు విక్రయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios