Toyota Glanza: టయోటా గ్లాంజా విడుదల.. ధరెంతో తెలుసా..?
దేశీయ మార్కెట్లోకి కొత్త టొయోటా గ్లాంజా లాంచ్ చేయబడింది. కొద్ది వారాల క్రితం మారుతి సుజుకి బాలెనో మోడల్ విడుదల చేసిన క్రమంలోనే ఇది విపణిలోకి విడుదల అయ్యింది
టయోటా సంస్థ తమ “గ్లాంజా”(Glanza) హ్యాచ్ బ్యాక్ మోడల్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. గ్లాంజా 2022 మోడల్ గా తీసుకొచ్చిన ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది టయోటా . భారత్ లో మారుతీ సుజుకితో జతకట్టిన టయోటా .. సుజుకిలోని బలెనో, బ్రేజ్జా, వంటి మోడల్స్ ను టయోటా సంస్థ తమ బ్యాడ్జ్ తో భారత్ లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో సుజుకిలోని బలెనో మోడల్ ను.. గ్లాంజా పేరుతో టయోటా మార్కెట్ చేసుకుంటుంది. ఇటీవలే సుజుకిలోనూ బలెనో ఫేస్ లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లోకి విడుదలవగా.. టయోటా సైతం గ్లాంజా మోడల్ కు కొత్త మెరుగులు దిద్ది మార్కెట్లోకి విడుదల చేసింది.
అయితే బ్యాలినోతో సరిపోల్చితే.. గ్లాంజాలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్సటెరియర్ పరంగా టయోటా బ్రాండ్ మార్క్ లుక్ ఇప్పుడు గ్లాంజాలో కనిపిస్తుంది. 2022 టయోటా గ్లాంజాలో 1.2-లీటర్ నాలుగు-సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్, డ్యూయల్ VVT ఇంజన్ తో వస్తుంది. 89bhp మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ ఆప్షన్లలో లభిస్తుంది. ముందు భాగాన కొత్తగా టయోటా సిగ్నేచర్ గ్రిల్, ఎల్-ఆకారపు LED DRL, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్ప్లిట్ LED టెయిల్ లైట్లు అమర్చారు. ముందు వెనుక కూడా కొత్తగా డిజైన్ చేసిన బంపర్లు అమర్చారు. 2022 మోడల్లో కొత్తగా 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ అందుబాటులోకి తెచ్చారు.
ఇక ఇంటీరియర్ విషయానికొస్తే.. టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ లో హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), 360-డిగ్రీ కెమెరా, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వంటి ఫీచర్స్ ఉన్నాయి. యాక్టివ్ సేఫ్టీలో భాగంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS EBD, ESP, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు సీట్-బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. మోడల్ వారీగా ఈ 2022 మోడల్ గ్లాంజా ధరలు ఎలా ఉన్నాయి. E MT: రూ. 6.39 లక్షలు, S MT: రూ. 7.29 లక్షలు, S AMT: రూ. 7.79 లక్షలు, G MT: రూ. 8.24 లక్షలు, G AMT: రూ. 8.74 లక్షలు, V MT: రూ. 9.19 లక్షలు, V AMT: రూ. 9.69 లక్షలుగా ఉన్నాయి.