అన్నం వండేవారే ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద, దాన్ని తినేవారిమీద కూడా  ప్రభావం చూపుతుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని చూడకుండా పెడతారు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవేద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించటం వల్లనే నైవేద్యానికి అంత రుచి వస్తుంది.

వంట చేసేవారు కోపంగా, విసుగ్గా వంట చేస్తే ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా దాన్ని భుజించినవారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయమవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు వంటచేసేవారు శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా వంటచేస్తే దానికి రుచితోపాటు ఆ వంట తిన్నవారి మనసులు సంతోషంగా ఉంటాయన్నది పూర్వీకుల విశ్వాసం.

లోకంలో మానవులు రెండు రకాలుగా ఉంటారు. ఒకి దాత, రెండవ వారు అదాత. ఇతరులకు అన్నం దానం చేసితాను తినేవారు దాతలు అవుతారు. ఎవరికీ ఏమీ పెట్టకుండా తినేవారు అంటే విషపూరితమైన పదార్థాలను తినేవారు అని అర్థం వారిని అదాత అంటారు. దాతలకు తర్వాత రోజుల్లో అన్నం లభిస్తుంది. అంటే తనకున్న దానిలో ఎదుటివారికి పెడతారు కావున తమకు అవమసరమైనప్పుడు లభిస్తుంది. అదాతకు తర్వాత రోజుల్లో అన్నం లభించదు. ఎవరికీ ఏమీ పెట్టకుండా ఉంటారు.

ఇతరులకు అన్నం పెట్టకుండా తాను ఒక్కడే తినడం వలన ఆ తీసుకున్న ఆహార పదార్థం విషంతో సమానం అవుతుంది. దాత అదాత ఇద్దరూ తమకు ఆహారం కావాల్సినప్పుడు ప్రయత్నిస్తారు కాని దాతకు లభిస్తుంది. అదాత లభించదు. ఆ సమయంలో కూడా దాతకు ఏదైనా లభిస్తే ఎదుటివారికి పెట్టి  తాను తినాలనే ఆలోచన ఏర్పడుతుంది. దీనిని ఉత్కృష్టమైన పని అంటారు. కాని అదాత తినడం కోసం మాత్రమే సంపాదిస్తారు. ఇవి పాపాత్ములు చేసే పనులు. వీరికి భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఉదా : ఒక షాపు యజమానికి పెద్ద స్వ్‌ీ షాపు చాలా రకాల వెరైటీలు లభించే షాపు ఉంటుంది. కాని ఆ కుటుంబ సభ్యులందరికీ షుగర్‌ వ్యాధి ఉండి కనీసం స్వ్‌ీ ఎలా ఉంటుందో తినలేని స్థితిలో ఉంటారు. అందరూ వచ్చి మీ షాపులో స్వీట్స్  చాలా బావుంటాయి, ఎంత టేస్టీగా ఉంటాయో అని చెపుతూ ఉంటే వీరికి బాధ కలుగుతుంది కాని ఏమీ చేయలేని స్థితి.

హోమాలు అవి చేస్తున్నప్పుడు హవిస్సు అని చేస్తారు. దానిని కూడా అన్నంతోనే వండుతారు. ఇది స్వాహా కారాలు చేస్తూ హోమాలలో వేస్తారు అది అగ్నికి ఆహుతి అయి మేఘం అవుతుంది. ఆ అన్నమే మేఘంగా మారుతుంది. సూర్యుడు తన కిరణాల ద్వారా భూమి మీద ఉన్న నీటిని స్వీకరించి ఔషధులను అన్నాన్ని సృష్టిస్తాడు. ఆ అన్నంతోనే ప్రాణికోటి జీవిస్తుంది. ఆ అన్నమే శరీరానికి బలాన్నీ చేకూరుతుంది.  ఆ బలంతోనే తపస్సులు చేయగలుగుతారు. స్వచ్ఛమైన మనస్సుతో చేసే వారికి తపస్సు ఫలిస్తుంది. ఆ మనస్సు స్వచ్ఛంగా ఉంటేనే దాని ఫలితాన్ని అనుభవించగలుగుతారు.

అన్నసూక్తం అని ఒక పారాయణం ఉంటుంది. వంట చేసేవారు ప్రతీరోజూ అన్నపూర్ణాష్టకం చదివితే తాము చేసిన వంటకు ఫలితం లభిస్తుంది. ఎంత మంది ఆ ఆహారాన్ని తిని ఆనందంగా ఉంటారో వీరికి తెలియకుండా అంత ఎక్కువ స్థాయిలో పుణ్యం సంపాదించుకుంటారు.

ఈ భూమిపైకి వచ్చినందుకు కర్మలను తగ్గించుకునే పుణ్యాన్ని సంపాదించుకోవడమే ప్రయత్న పూర్వకంగా చేసే పని. మిగతా చేసే పనులు ఏవీ పనులు కావు. శ్రీమాత్రేనమః.

డా.ఎస్.ప్రతిభ