Vijaya Ekadashi 2023: విజయ ఏకాదశి నాడు విష్ణువును ఆరాధిస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి అంతా శుభమే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఈ రోజు శుభ ముహూర్తం ఎప్పుడు, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Vijaya Ekadashi 2023: ఫాల్గుణ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ఈ ఏడాది ఫిబ్రవరి 16 న అంటే ఈ రోజే వచ్చింది. ఈ రోజును హిందువులకు అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఏకాదశి అదృష్టాన్ని, విజయాన్ని, సంపదను, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. విజయ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ రోజు నిష్టగా విష్ణుమూర్తికి ఉపవాసం ఉండటం వల్ల అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని. ఓటమీ అనేది ఎదురుకాదని నమ్ముతారు. ఈ ఏడాది విజయ ఏకాదశిని ఫిబ్రవరి 16, 17 తేదీల్లో జరుపుకోనున్నారు.
- ఏకాదశి తిథి ఫిబ్రవరి 16 న ఉదయం 5:32 గంటలకు ప్రారంభమవతుంది.
- ఏకాదశి తిథి ఫిబ్రవరి 17న తెల్లవారు జామున 2:29 గంటలకు ముగుస్తుంది.
- ఉపవాస సమయం: ఫిబ్రవరి 17 న ఉదయం 08:01 నుంచి 09:13 వరకు ఉండాలి.
- ఉపవాస సమయం: ఫిబ్రవరి 18 న ఉదయం 6:57 నుంచి 9:12 వరకు ఉండాలి.
విజయ ఏకాదశి పూజా విధానం
విజయ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వ్యక్తులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాతే ఉపవాసం ఉండాలని మత గ్రంథాలు చెబుతున్నాయి. దీని తర్వాత విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలను గంగాజలంతో శుభ్రం చేయండి. ఆ తర్వాత హారతి ఇవ్వండి. లక్ష్మీ పూజ సమయంలో కేవలం నెయ్యి దీపం మాత్రమే వెలిగించాలని గుర్తుంచుకోండి. పూజ చేసిన తర్వాత మీ రోజువారీ పనులను ప్రారంభించండి.
విజయ ఏకాదశి మంత్రం
విజయ ఏకాదశి మంత్రం: "ఓం నమో భగవతే వాసుదేవాయ" లేదా "ఓం నమో నారాయణాయ". పూజ సమయంలో ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భక్తులు తాము కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటారట. అంతేకాదు తాము పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
విజయ ఏకాదశి నాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన లేత రంగు బట్టలను ధరించాలి.
- ఉల్లిపాయ, వెల్లుల్లిని వేసిన ఆహారాలను అసలే తినకూడదు.
- ఏకాదశి పర్వదినాన ఉదయం, సాయంత్రం వేళల్లలో ఉపవాస గాథ వినండి.
- ఈ ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 106 సార్లు అనండి.
