బాహ్య శరీర శుద్ధి ప్రక్రియలో స్నానం పాత్ర ముఖ్యమైనది. స్నానం చేయడం వల్ల ఆలోచనల్లో మార్పు వస్తుంది. స్నానం చేయక మునుపు ఉన్న అననుకూల ధోరణి స్నానం చేసిన తర్వాత అనుకూలంగా మారుతుంది. స్నానాలు చాలా రకాలు : ఉప్పునీటి స్నానం, సముద్రస్నానం, అభ్యంగన స్నానం, సుగంధ ద్రవ్యాల స్నానం ... ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. స్నానం చేయడం అనేది అద్భుతమైన జ్యోతిర్వైద్య ప్రక్రియ.  స్నానం చేస్తూ ఉన్నంతసేపు కూడా భగవంతుని ప్రార్థన ప్రత్యేకంగా తెలియజేయబడింది. ''అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః'' అనే శ్లోకాన్ని జపిస్తూ మార్జనం చేసుకోవడం సంప్రదాయం.

ప్రవాహజలంలో స్నానం చేయడం శ్రేష్ఠం. అక్కడ ఎప్పికప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది. నదులలో చెరువులలో స్నానం, తరువాత బావులు, బోరులు, తొట్టి స్నానాలు ఏవైనా మంచివే.  శరీరం బయట ఉన్న ఆరా మొత్తం పరిస్థితులకు, ఆలోచనలకు ప్రభావితమై వ్యతిరేక భావనలతో కూడుకుని ఉంటుంది. దానిని తొలగించుకోవడానికి మొట్టమొదటగా బాహ్యదేహశుద్ధిలో స్నానం అవసరం. అందులో ఉప్పునీటి స్నానం ఉత్తమం. సముద్రజలంలో అయోడిన్‌ అను పదార్థం ఉంటుంది.

''శరీరంలోని మెరుపుకి లావణ్యం అని పేరు. లవణస్య భావం లావణ్యం అని వ్యుత్పత్తి. లవణంలో ఏ మెరుపు ఉందో ఆ మెరుపు చర్మంలో ఉంటే దాన్ని లావణ్యం అని పిలుస్తారు. లవణం వల్ల ఈ లావణ్యం వస్తుంది అనే అంశం మన పదాలలోని విజ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ లవణానికి అధిపతి చంద్రుడు. చంద్రుడిలోని మెరుపు, ఆకర్షణ, ఆహ్లాదం అందరూ ఎరిగినదే. కాని ఈ లవణం శరీరం లోపలికి మంచిది కాదు. 

ఈ లవణపు నీటితో స్నానం చేయడం చాలా మంచిదని ఆరోగ్యకరమని ప్రతీ పూర్ణిమకు, అమావాస్యకు సముద్ర స్నానం చేసే ఆచారాన్ని మన పెద్దలు ఏర్పరచారు. ఉప్పునీటి స్నానంలో ఉన్న వైశిష్ట్యంతోపాటు సముద్రస్నానం వల్ల  సకల తీర్థజలాలలో స్నానం చేసిన ఉత్తమ ఫలితం కూడా సిద్ధిస్తుంది. ఉప్పునీటి స్నానం వల్ల వచ్చే ప్రయోజనాలను ఆధునిక పరిశోధనల్లో గుర్తించారు. ఉప్పు ఒక రకంగా యాంటీబయాటిక్‌గా కూడా పనిచేస్తుంది.

శరీరం ఎన్నో గ్రంథుల కూడలి. వాటన్ని పనితీరును క్రమబద్దీకరిస్తుంది ఉప్పు. ముఖ్యంగా థైరాయిడ్‌ గ్రంథి వలన వచ్చే సమస్యలకు ఉపశమనం లభిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. బయికి వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులకొకసారి స్నానం చేయాల్సి వస్తుంది. ఒళ్ళంతా దురదగా ఉంటుంది. ఈ సమస్యనుంచి బయటపడేందుకు ఉప్పునీటి స్నానం ఉపకరిస్తుంది. ఉప్పు శరీరాన్ని శుభ్రం చేయడం వలన రక్తనాళాలు చురుగ్గా తయారై రక్త సరఫరా కూడా స్వేచ్ఛగా సాగుతుంది. రక్త ప్రసరణ ఎప్పుడైతే చురుగ్గా సాగుతుందో అప్పుడు ప్రాణవాయువు పుష్కలంగా అందుతుందటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో చర్మకాంతి నిగనిగలాడుతుంది.''

శరీరం శుద్ధి అయ్యేందుకు మాత్రమే కాకుండా, అలసిపోయినపుడు తిరిగి శక్తిని పొందడానికి కూడా స్నానాలను సూచించినారు. వేరు వేరు గ్రంథాల్లో స్నాన విధానాలు, సమయాలు నిర్దేశించబడినాయి. వాటి వల్ల కలిగే ఫలితాలు అనేకం. అన్నింకన్నా ముఖ్యం ఆలోచనల్లోని మార్పులే. 

''స్నానం చేయడం అనేది తమకుతోచినప్పుడు కాకుండా సూర్యోదయానికి పూర్వం ప్రాతఃకాలంలో చేయడం శ్రేష్ఠం. దీని వలన ''రూపం, బలం, తేజం, శౌచం, ఆయుష్షు, తపస్సు, ఆరోగ్యం, మేధస్సు వృద్ధి చెందుతాయి. లోభం, దుస్స్వప్నాలు నశిస్తాయి. ఈ పది గుణాలు రావడానికి కారణం సూర్యచంద్రులే. రాత్రంతా చంద్ర నక్షత్రామృతం, పగలు సూర్యరశ్మి నీటిలో ప్రవేశిస్తాయి. రాత్రి నీటిలో రోగ కీటకాలు లోపల దాగి ఉంటాయి. సూర్యరశ్మి ప్రవేశించగానే అవి పైకి వస్తాయి. కాబ్టి ఉదయమే స్నానం చేయడం మంచిది.''

పర్వదినాలలోని అభ్యంగస్నానాలలో శరీర మర్దన వల్ల శ్రమరాహిత్యం, దృఢకాయం, చర్మ మృదుత్వ రక్షణ, రోమకూపాల ద్వారా నూనె శరీరాంతర్గతమై కండరాల నుంచి నరాలకు  చేరి అక్కడ బలం చేకూరుతుంది. అందువలన వాతదోషాలు పోయి, కండ్లకు చూపు మెరుగుపడుతుంది. నిద్ర సుఖంగా ఉంటుంది. శరీరాంగాలు దృఢమౌతాయి. పాదాలలోని మ్టి పోయి కండ్లకు మెదడుకు మంచి చేకూరుతుంది. కళ్ళలోని సిరలు అరికాళ్ళ వరకు సంబంధం కలిగి ఉడడం వలన వేడిచేసినా అరికాళ్ళకే నూనె రాస్తారు. అప్పుడు నిద్ర హాయిగా పడుతుంది.

షష్టిపూర్తి, అశీతిపూర్తి మొదలైన ప్రత్యేక ఉత్సవాదుల్లో అనేక కలశాల్లో నీటిని నింపి వాటిల్లో సుగంధద్రవ్యాలైన కర్పూరం, వ్టివేళ్ళు, తక్కోలం, ఏలకులు, లవంగాలు వేసి మూడు రోజులు  అలాగే ఉంచి మంత్రపూర్వకంగా ప్రోక్షణ చేయడం వలన కడుపులో మంట, విదాహం, తాపం, పిత్తం, కఫం, వాతం, పొత్తి కడుపులో పుట్టే రోగాలు, ప్రమేహం, జ్వరం, మూలవ్యాధి, దురద మొదలైన వ్యాధుల నుండి కాపాడబడతారు.

ఒక వయస్సు వచ్చిన తర్వాత శరీరానికి తట్టుకునే శక్తి (రెసిస్టెన్స్‌) తగ్గిపోతుంది. ఏ వ్యాధులైనా తొందరగా సోకే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో తనగురించి ఆలోచిస్తూ ఉంటాడు. సమాజం గురించి కాని, తోటివారి గురించి పరోపకారాల గురించి ఆలోచనలు తగ్గిపోతాయి. వీటి వలన నివారణలు పొందడానికి అప్పుడప్పుడు సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయాలి. ఏ పనిచేసినా పూర్వకర్మలద్వారా వచ్చే ఆలోచనలను మార్చుకోవడానికే.

కార్తీక మాసం, మార్గశిర మాసం, మాఘమాసాల్లో సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలని చెప్తారు. రాత్రి ఎక్కువ సమయం, ఉదయం తక్కువ సమయం ఉండడం వలన శరీరం చైతన్య శక్తిని కోల్పోతుంది. ఆ చైతన్యాన్ని తిరిగి పొందడంకోసం ఉదయం స్నానం చేసి కార్తీకదీపాలు, మార్గళి నివేదన చేయడం జరుగుతుంది. స్నానం చేసే సమయంలో ప్రస్తుతం వాడే సోపులు వాడకూడదు.

శనగపిండి కాని, పెసరపిండి కాని వాడడం మంచిది. ముఖ్యంగా చలి కాలంలో తప్పనిసరి. చలికాలంలో సోపు పెట్టుకొని స్నానం చేయడం వలన శరీరంపైన ఉండే రోమకూపాలు మూసుకుని పోతాయి. సోపులు మొదలైనవి సున్నితంగా ఉండడం వలన శరీరం లోపల వరకు వాని ప్రభావాలు వెళ్ళవు. కాని పిండితో మర్దన చేసి స్నానం చేయడం వలన రోమాలు తెరుచుకుని లోపలి వరకు బలం చేకూరుతుంది.

గ్రహదోషాలున్నట్లుగా జాతకంలో గుర్తించినపుడు ఆయా గ్రహాలకు నిర్దేశించబడిన మూలికలు, వృక్షాల ఆకులు, బెరడు మొదలైన వానిని నీటిలో వేసి వేడి చేసి ఆ నీటితో స్నానాదులు చేయడం ద్వారా శరీరంలో ఆ గ్రహ సంబంధమైన వ్యతిరేక భావనలు తొలగి శుద్ధి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. మనిషి వెంటనే చేయగలిగేది, బాహ్య పవిత్రతకు కారణమై, మంచి ఆలోచనల వైపు వెళ్ళేట్లుగా చేసేది స్నానమే.