శ్రవణా నక్షత్రం పూర్ణిమనాడు వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. ఈ మాసం స్త్రీలకు, పురుషులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ పవిత్రమైన మాసం. శ్రావణమాసం ఆగస్టు 2వ తేదీన 2019 నుంచి ప్రారంభం అవుతుంది. శ్రావణమాసం అంటే శుభాల మాసం. ఈ మాసంలోనే వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు అన్నీ పవిత్రమైన వారాలే.

ఈ మాసం అంతా పవిత్రమైన మాసంగానే భావిస్తారు. స్త్రీలు దోసిట్లో సెనగల మూట, కాళ్ళకు పసుపు రాసుకోవడం, తలలో పూలు ధరించడం, చేతులకు తోరణాలు, కొత్త చీరలు, పట్టుచీరలతో ప్రకృతి అంతా శోభాయ మానంగా కనబడుతుంది. కొత్త కొత్త బంగారు నగలు, గాజులు ధరిస్తారు. ఏ ఇంట చూసినా పండుగ వాతావరణమే కనబడుతుంది. ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి. ప్రతీ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఈ మాసంలో వచ్చే పండుగలు, విశిష్టతల గురించి తెలుసుకుందాం.

ఈ మాసం మొదలు శుక్రవారంతో మొదలౌతుంది. ఈ రోజు అందరూ గౌరీ పూజలు చేసుకుంటూ ఉంటారు. చంద్ర గ్రహ లోపానికి గౌరీ పూజ, లలితా పూజ చెప్పబడింది. ఈ మాసంలో వచ్చే 5 శుక్రవారాలు కూడా అందరూ లలితా పూజను చేసుకోవడం మంచిది. దానివలన చంద్రుని వలన వచ్చే దుష్ఫలితాలు నివరించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

శ్రావణ సోమవారాలు : ఈ మాసంలో వచ్చే సోమవారాలు దాదాపు అందరూ ఉపవాసాలు ఉంటారు. శివుడికి అభిషేకం చేయడం, పార్వతికి కుంకుమ పూజ చేయడం చేస్తారు.

శ్రావణ మంగళవారాలు : కొత్తగా పెళ్ళైన స్త్రీలు మంగళవార నోములు నోచుకుటాంరు. ఇవి స్త్రీకి ఎంతో ముఖ్యమైనవి. తమ మాంగళ్యాన్ని కాపాడమని కోరుతూ పూజ చేస్తూ ముత్తైదువులకు శనగలు వాయనం ఇస్తారు. పెళ్ళికాని పిల్లల చేత కూడా కొన్ని ప్రాంతాలవారు చేయిస్తారు.

శ్రావణ శుక్రవారాలు : రెండవ శుక్రవారం అంటే పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం చేస్తారు. లక్ష్మీదేవి ధనం, ధాన్యం, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి అన్నీ కలిగిస్తుంది. కావున ప్రతీ శుక్రవారం ముఖ్యమైనదే. విశేషంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

శ్రావణ శనివారాలు : ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి ఇలవేల్పు ఎవరికైనా వెంకటేశ్వర స్వామి ఉంటే వారికి దీపం పెట్టడం, చలిమిడిని నైవేద్యంగా పెట్టడం, దీపం పెట్టడం చేస్తారు. శనిదేవుని అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు విశేషతను సంతరించుకున్నాయి.

శ్రావణపౌర్ణమి : అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా ఈ పండుగను జరుపుకుటాంరు. దీనినే రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజననే హయగ్రీవ జయంతి చేసుకుటాంరు.

ఇలా శ్రావణమాసంలో వచ్చే ప్రతీ రోజు విశేషమైనదిగానే చెప్పుకోవచ్చు. ఈ శ్రావణమాసం శివకేశవులకు అభేదం లేదు అని తెలియజేస్తుంది. ప్రతీ ఇల్లు, గుడి, గోపురం అన్నీ కూడా జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి. కావున ఈ విశేషమైన శ్రావణ మాసాన్ని అందరూ ఆనందంతో ప్రారంభించాలని కోరుకుంటూ..... శ్రీమాత్రేనమః.

ధర్మరక్షణ, లోకక్షేమం, సొంత కోరికలు, సంకల్పాలు, నెరవేర్చుకోవడానికి రోజు రెండుపూటలా ఈ స్తోత్రం అందరూ 21సార్లు జపించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.

                                మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ విశ్వశ్రీః విశ్వమంగళమ్‌

                                షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ జగన్నీరోగ శోభనమ్‌

                                జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ లోకం సద్బుద్ధి సుందరమ్‌

                                పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్‌ మాంగల్యానంద జీవనమ్‌