కరోనా కారణంగా గడిచిన రెండుళ్లలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ.. నామమాత్రంగానే వివాహాలు చేసుకున్నారు కొందరు. అయితే కరోనా ఆంక్షల సడలింపు, మరోవైపు శుభముహూర్తాలు అధికంగా ఉండడంతో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. వందలాది జంటలు ఒక్కటవుతున్నాయి.
శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు.. ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు.. జీవించు నూరేళ్లు.. ఇలా ఊరూరా పెళ్లి సందడి నెలకొంటోంది. కల్యాణ మంటపాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, గుళ్లు, ఇలా వివాహవేడుకలతో కనువిందు చేస్తున్నాయి. జూన్ 29 నుంచి జూలై 30వరకు ఆషాఢమాసం ఉంది.
భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకమాసాల్లో (ఆగస్టు 23 నుంచి నవంబర్ 27వరకు శుక్రమౌఢ్యమి (మూఢం) కావడంతో మరో నాలుగు నెలలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు విరామం రానుంది. పెళ్లిళ్లే కాకుండా ఉపనయాలు, గృహా ప్రవేశాలు, దేవతా ప్రతిష్ట మహోత్సవాలు, అన్ని రకాల శుభకార్యాలకు జూన్ 23 వరకు అనువైన మంచి శుభ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతు్న్నారు. ఏప్రిల్ లో ఇప్పటికే 13,14,15,16 తేదీల్లో వేలాది మందికి వివాహాలయ్యాయి. ద్వారకాతిరుమల, అన్నవరం, శ్రీనివాసపురం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో వందలాది వివాహాలయ్యాయి.
పెళ్లిళ్లపై కరోనా ప్రభావం..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల దేవస్థానంలో ఏటా వేల సంఖ్యలో వివాహాలవుతున్నాయి. కరోనా ప్రభావంతో గడిచిన రెండేళ్లలో నామమాత్రం సంఖ్యలో పెళ్లిళ్లు అయ్యాయి. 2020లో కేవలం 120 పెళ్లిళ్లు మాత్రమే అయ్యాయి. కోవిడ్ ఆంక్షలకు కొంత మేర సడలింపులు ఇవ్వడం, నిర్థిష్టమైన సంఖ్యలో వివాహాలకు అనుమతులు ఇవ్వడంతో 2021లో 603 వివాహాలయ్యాయి. ఇప్పుడు కరోనా ఆంక్షలు తొలగించడంతో గడిచిన ఐదు రోజుల్లోనే 311 పెళ్లిళ్లయ్యాయి. రానున్న రెండు నెల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో ఇక్కడ వేల సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నాయి.
శుభకార్యాలతో వందల మందికి ఉపాధి
పెళ్లిళ్లు ఊపందుకోవడంతో పాటు ఇతర అన్ని రకాల శుభకార్యాలకు అనువైన రోజులు కావడంతో వేలాడి మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. కల్యాణ మంటపాలు, కేటరింగ్, వంటవాళ్లు, పురోహితులు, ఫోటో, వీడియో గ్రాఫర్లకు, ట్రావెల్స్, కార్లు, బస్సులు, ఐస్ క్రీమ్, మినరల్ వాటర్, ఈవెంట్ మేనేజ్ మెంట్లు, పూలు, డెకరేషన్, లైటింగ్, కూరగాయలు, కిరాణా, కిళ్లీ, వస్త్ర దుకాణాలు, బంగారు, వెండి ఆభరణాల షాపులు, మాంసలు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్టీలు, సాంస్కృతిక కళాకారులతో పాటు పలు విభాగాల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి లభించనుంది.
ఇప్పటికే పెళ్లిళ్లు కుదిరిన వారందరూ ముందస్తు బుకింగులు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పరోక్షంగా వీటికి అనుబంధంగా ఉన్న రంగాల్లోని వేలాది మందికి శుభకార్యాల ద్వారా ఉపాధి లభించనుంది. రేండేళ్లనుంచి అంతంతమాత్రంగా శుభకార్యాలు చేశారు. ఇప్పుడు వరుస ఫంక్షన్లు రావడంతో అన్ని రకాల వాళ్లకు ఉపాధి చేకూరుతుందని చెప్పొచ్చు.
జూన్ 23 వరకు మంచి ముహూర్తాలు..
పెళ్లిళ్లతో పాటు ఉపనయనాలు, గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ట వంటి శుభకార్యాల నిర్వహణకు జూన్ 23వ తేదీ వరకు మంచి ముహూర్తాలున్నాయి. జూన్ 29నుంచి జూలై 30వతేదీ వరకు ఆషాఢమాసం, ఆగస్టు 23నుంచి నవంబర్ 27వ తేదీవరకు భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసాల్లో శుక్రమౌఢ్యమి (మూఢం) కారణంగా నాలుగు నెలల పాటు శుభకార్యాలకు మంచి రోజులు లేవు అని ప్రముఖ పురోహితులు చెబుతున్నారు.
జూన్ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే...
ఈనెల 21,22,24 తేదీలు..
మే నెలలో తేదీలు : 3,4,12,14,18,21,22,25
జూన్ లో తేదీలు : 1,3,5,6,8,9,10,15,17,18,19,22,23
ఇతర శుభ ముహూర్తాలు
మేలో 4నుంచి 9వ తేదీ వరకు, 11 నుంచి 15వరకు, తిరిగి 18,20,21,22,23,25 తేదీల్లో ఇతర శుభముహూర్తాలు ఉన్నాయి.
జూన్ లో 1 నుంచి ఆరోతేదీ వరకు, 8 నుంచి 11వ తేదీవరకు, 13, 15,16,17,18,19,22,23 తేదీలు ఇతర శుభ ముహూర్తాలున్నాయి.