యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా
 యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:''

ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మనుస్మృతి తెలుపుతుంది. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వసంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది.

" ప్రణమ్యా మాతృదేవతాః "

* ప్రత్యేకంగా ఏదో ఒకరోజున మాత్రమే కాకుండా అనుక్షణం మహిళను గౌరవించే ఏకైక సమాజం భారతీయ సమాజం.

* మాతృదేవోభవ అంటూ అమ్మను తొలిదైవంగా భావించింది భారతీయ సమాజం.

* ఎక్కడ మహిళలు గౌరవింపబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారని తెలియజెప్పింది భారతీయ సమాజం.

* కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని సంస్కరించే గురుతరమైన బాధ్యతను గృహిణిగా మహిళకు అప్పజెప్పింది మన భారతీయ సమాజం.

* భూమితో బాటు సమస్త ప్రకృతిని మాతృస్వరూపంగా భావించి ఆరాధిస్తుంది మన భారతీయ సమాజం.

* నరకాసుర సంహారంలో పరమాత్ముడికి సహాయపడి మహిళ సబల అని నిరూపించింది మన సత్యభామ.

* తను ఎంతగానో ప్రేమించి, అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు శ్రీరామచంద్రుడిని ధర్మరక్షణ నిమిత్తం అడవులకు పంపించింది మన కౌసల్య. రాముడిని అనుసరించి అన్ని కష్టాలు అనుభవించినా మనోధైర్యానికి ప్రతీకగా నిలిచిన అమ్మ సీత.

* దుష్ట ఆక్రమణకారుల నుండి దేశాన్ని, సమాజాన్ని రక్షించడం కొరకు తన కుమారుడు శివాజీని వీరుడిగా తీర్చిదిద్దింది జిజియామాత.

* కాకతీయ మహా సామ్రాజ్యం పునాదులు కదిలించాలని చూసిన శతృమూకల పీచమణచి మహాసామ్రాజ్ఞగా వెలుగొందిన వీరనారి రుద్రమదేవి.

* ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని  భుజాన శిశువు, చేతిలో ఖడ్గాన్ని ధరించి ఆంగ్లసైన్యంతో వీరోచితంగా పోరాడింది వీరనారి ఝాన్సీలక్ష్మి.

* ఒక్క వాక్యంలో చెప్పాలంటే సృష్టి ఆదిగా మహిళలకు విశేషమైన, గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించింది భారతీయసమాజం. అన్నిరంగాలలో రాణించి కీర్తిప్రతిష్ఠలు గడించారు మన మాతృమూర్తులు.  దేశ, ధర్మ రక్షణలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు మన మహిళలు.

ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు.. భారతీయ సమాజంలో మహిళలకు మొదటి నుండి ఉన్న గౌరవనీయ స్థానం ఇది.. పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువ ప్రాధాన్యతే మహిళలకు ఉంది. మన దేశాన్ని భారత మాతగా కొలుస్తున్నాం. మన పురాణాలను గమనించినట్లైతే దుర్గామాత, పార్వతి, పోచమ్మ ఎల్లమ్మ తదితర దేవతలను శక్తికి ప్రతీకగా, సరస్వతి, లక్ష్మిలను చదువు, సంపదకు గుర్తులుగా పూజిస్తాం.

దురదృష్టవశాత్తు మన దేశంపై విదేశీయుల దండయాత్రలు మొదలయ్యాక పరిస్థితి మారింది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. మరోవైపు మూఢనమ్మకాలు పెరిగాయి. దీంతో స్త్రీలను ఇంటికే పరిమితం చేయడం మొదలు పెట్టారు. అయినా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ తదితర వీర వనితలు తమ శక్తి సామర్ధ్యాలను చాటుకున్నారు. ఇక ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా దూసుకుపోతున్నారు. రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో ఎందరో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు. అయినా ఎక్కడో లోపం. ఇవన్నీ పైపై మెరుగులేనా అనిపిస్తుంది.