గరుడ పురాణం పాపపుణ్యాల గురించి ఎంతో సవివరంగా చెబుతుంది. ఈ పురాణం ప్రకారం కొన్ని పనులు మహా పాపంతో సమానం. అలాంటి పనులు ఏవో తెలుసుకోండి... ఆ పాపపు పనుల వల్ల నరకంలో ఎలాంటి శిక్ష పడుతుందో కూడా గరుడ పురాణం చెబుతోంది.
హిందూమతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఇది ఎంతో ముఖ్యమైన గ్రంథంగా చెప్పుకుంటారు. దీనిలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉంటాయి. అలాగే 271 అధ్యయనాలు ఉంటాయి. దీన్ని వైష్ణవ శాఖకు సంబంధించిన గ్రంథంగా చెప్పుకుంటారు. ఇందులో నారాయణుడే స్వయంగా జనన మరణాల గురించి, మరణానంతరం జరిగిన సంఘటన గురించి వివరించాడని చెబుతారు.
గరుడ పురాణం స్వర్గం, నరకం రెండింటి గురించి స్పష్టంగా వివరిస్తోంది. గరుడ పురాణం ప్రకారం మంచి పనులు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, అలాగే ఎలాంటి తప్పులు చేయడం వల్ల మరణానంతరం ఎలాంటి శిక్షలు పడతాయో కూడా గరుడ పురాణం వివరిస్తోంది. గరుడ పురాణం బోధనలను అర్థం చేసుకొని దాన్ని అనుసరించే వ్యక్తి జీవితంలో కచ్చితంగా విజయం సాధిస్తాడని అంటారు. అతడు మరణం తర్వాత ఆ శ్రీ విష్ణు పాదాల వద్ద స్థానాన్ని పొందుతాడు అని చెబుతారు.
గరుడ పురాణం ప్రకారం కర్మ ఫలితాలను మరణానంతరం అనుభవించాల్సి వస్తుంది. మంచి పనులు చేసిన వారు మరణానంతరం మోక్షాన్ని స్వర్గాన్ని పొందుతారని గరుడ పురాణం చెబుతోంది. ఇక చెడు పనులు చేసేవారు నరకానికి వెళతారని అక్కడ తీవ్రమైన హింసలతో కూడిన శిక్షలకు గురవుతారని చెబుతోంది. గరుడ పురాణం ప్రకారం ఐదు ఘోరమైన పాపాలు ఏమిటో తెలుసుకోండి.
ఒక అమాయకుడిని చంపడం
అప్పుడే పుట్టిన బిడ్డను లేదా గర్భిణీ స్త్రీని, గర్భంలో ఉన్న పిండాన్ని చంపడం మహా పాపంగా చెబుతారు. అలాంటి వ్యక్తికి మరణానంతరం నరకంలో తీవ్రమైన హింస జరుగుతుంది. భయంకరమైన శిక్షలు వేస్తారు.
స్త్రీని అవమానించడం
ఏ తప్పు చేయని స్త్రీని హింసించడం, దోపిడీ చేయడం, ఎగతాళి చేయడం, వారిని అవమానించడం వంటివి నరకానికి తీసుకెళ్తాయని, కఠినమైన శిక్ష పడేలా చేస్తాయని గరుడ పురాణం చెబుతుంది. కాబట్టి స్త్రీల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం.
స్త్రీని చెడు దృష్టితో చూడడం
భార్యను తప్ప ఇతర స్త్రీలను సోదరీమణులుగానే చూడాలి. స్నేహితుడి భార్యపై లేదా ఇతర స్త్రీపై చెడు దృష్టి పెట్టడం, ఆమెను బలాత్కారం చేయడానికి ప్రయత్నించడం లేదా తప్పుగా ప్రవర్తించడం అనేది మహా పాపాలలో ఒకటి. దీని ఫలితం మరణానంతరం నరకంలో కచ్చితంగా కనిపిస్తుంది. భరించలేని వేదనకు గురి చేసే శిక్షలను అనుభవించాల్సి వస్తుంది.
మతాన్ని అవమానించడం
మనసులో తమకు నచ్చిన మతాన్ని అనుసరిస్తారు. వారికి నచ్చినట్టు దేవతలను ఆరాధిస్తారు. దేవాలయాలను, గ్రంథాలను ఎగతాళి చేసేవారు జీవితంలో కచ్చితంగా అశాంతిని ఎదుర్కొంటారు. మరణం తర్వాత కూడా వారు కచ్చితంగా బాధపడతారు. మరణానంతరం నరకంలో వారికి తీవ్రమైన ఘోరమైన శిక్షలు తప్పవు.
బలహీనులపై దాడి
బలహీనులైన పిల్లలు, వృద్దులు, పేదలు, నిస్సహాయులను వేధించేవారు. ఎప్పటికైనా కూడా నరకానికి వెళతారు. వారు చేసిన పాపాలు మరణానంతరం అనుభవించాల్సి ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. కాబట్టి బలహీనులకు వీలైతే సాయం చేయండి. కానీ వారిపై దాడి చేయడం వంటివి చేస్తే మరణానంతరం మీ జీవితాన్ని మీరే నరకంలోకి తోసుకున్న వారవుతారు.
