ఖజానా ఖాళీ... అధికారం కోసం తహతహ: కాంగ్రెస్‌పై మోడీ మార్క్ పంచ్‌లు
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ఓ ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ పార్టీ అన్నీ బూటకపు హామీలు ఇస్తోందంటూ ప్రధాని మండిపడ్డారు
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ఓ ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ పార్టీ అన్నీ బూటకపు హామీలు ఇస్తోందంటూ ప్రధాని మండిపడ్డారు. అటు కేంద్రంలో, ఇటు అసోంలో ఆ పార్టీ అధికారంలో ఉండగా.. భద్రత, స్థిరత్వం విషయంలో విఫలమైందని మోడీ ఆరోపించారు.
అధికారం కోసం ఆ పార్టీ ఎంత నీచానికైనా దిగజారుతుందని ఆయన విమర్శించారు. అందుకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోనే ఉదాహరణ అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో అసోం నిర్లక్ష్యానికి గురైందని.. అసోంలో అవినీతి రెట్టింపైందని, చొరబాట్లు కూడా అదే రీతిలో వున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే ‘అబద్ధాలు.. అయోమయం.. అవినీతి.. హింసాత్మక’ పార్టీ అని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. మహిళా సాధికారత, ఉద్యోగాల కల్పన విషయంలో ఆ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రధాని దుయ్యబట్టారు. రెండు ఇంజన్ల ఎన్డీయే ప్రభుత్వం అసోం అభివృద్ధికి శతవిధాలా కృషి చేసిందని ఆయన హామీ ఇచ్చారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఖజానా ఖాళీ అయిందని, దానిని నింపుకోవడం కోసం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆరాట పడుతోందంటూ ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసోంలో బాంబు పేలుళ్లు, తుపాకుల సంస్కృతి, హింస ఎప్పుడు అంతమవుతుందో అని ప్రజలు ఎదురుచూసేవారని ప్రధాని గుర్తుచేశారు.
కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో ప్రజల కల నెరవేరిందని మోడీ వెల్లడించారు. స్మగ్లర్లకు కాంగ్రెస్ కొమ్ముకాసిందని.. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రైనోల స్మగ్లింగ్ ను అడ్డుకుందని మోడీ వెల్లడించారు. స్మగ్లర్లను జైల్లో పెట్టామని.. ఆక్రమణదారుల చెర నుంచి కజిరంగ పార్కును రక్షించామని ప్రధాని పేర్కొన్నారు.