ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫేస్ వాల్యూ లేదన్నారు వైసీపీ నేత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి. వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె 1994 ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని కబ్జా చేశారని ఆరోపించారు.

బాబు జీవితమంతా నికృష్టమైన, నీచమైన రాజకీయం తప్ప సూటిగా రాష్ట్రానికి ఇది చేశానని ఆయన చెప్పలేరని లక్ష్మీపార్వతి అన్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు 40 ప్రభుత్వ సంస్థలను మూతవేసిన చరిత్ర చంద్రబాబుదేనని ఆమె ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ సమయంలో రూ.3 వేల కోట్లుగా ఉన్న అప్పును రూ.60 వేల కోట్లకు పెంచి రుణాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత బాబుదేనని మండిపడ్డారు. ప్రపంచబ్యాంక్‌కు జీతగాడిగా ముద్రతెచ్చున్నారని, రైతులను కాల్చి చంపిన చరిత్ర ఆయనదేన్నారు.

చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ హయాంలో ఐటీ రంగం బాగా వృద్ధి చెందిందన్నారు. మీడియా ద్వారా తన కేసులు బయటకు రాకుండా తనను తాను కాపాడుకుంటున్నాడని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. ఆయన పరిపాలనలో నష్టాల్లో ఉన్న హేరిటేజ్‌ను పూర్తి లాభాల్లోకి తీసుకొచ్చారన్నారు.

లోకేశ్‌కు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చంద్రబాబు సర్టిఫికేట్ కొనిచ్చారని ఆరోపించారు. ఎంఏ తర్వాత పీహెచ్‌డీ చేసి ఆతర్వాత ఎంఫీల్ చేశానని చంద్రబాబు చెప్పడం బీకాంలో ఫిజిక్స్ చేసినట్లుగానే వుందని లక్ష్మీపార్వతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నవ్యాంధ్రను అవినీతిలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దారన్నారు.