Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరు జిల్లా అసెంబ్లీ టీడీపీ అభ్యర్థులు వీరే: ఖరారు చేసిన బాబు

మిగిలిన నియోజకవర్గాలపై శుక్రవారం రాత్రి వరకు కసరత్తు చేశారు. నెల్లూరు పార్లమెంట్‌, సూళ్లూరుపేట నియోజకవర్గాల అభ్యర్థులు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారని తెలుస్తోంది. ఇదే జిల్లా నుంచి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు కేటాయించారు. 
 

TDP candidates for assembly elections in Nellore district cleared
Author
Amaravathi, First Published Mar 2, 2019, 4:57 PM IST

అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థులు ఎంపికపై కసరత్తు వేగవంతం చేశారు. జిల్లాలు వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ అన్నీ పార్టీల కంటే ముందు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

అభ్యర్థుల ఎంపికను నెల్లూరు జిల్లా నుంచే చంద్రబాబు ప్రారంభించారు. నెల్లూరు సిటీ అభ్యర్థిగా మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి అభ్యర్థిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను ప్రకటించారు చంద్రబాబు. 

మిగిలిన నియోజకవర్గాలపై శుక్రవారం రాత్రి వరకు కసరత్తు చేశారు. నెల్లూరు పార్లమెంట్‌, సూళ్లూరుపేట నియోజకవర్గాల అభ్యర్థులు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారని తెలుస్తోంది. ఇదే జిల్లా నుంచి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు కేటాయించారు. 

నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు చంద్రబాబు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డిలు పోటీ పడుతున్నారు. 

కావలి ఇన్ చార్జ్ బీద మస్తాన్ రావు, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిలు విష్ణువర్థన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆయనకే ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించాలంటూ చంద్రబాబును కోరారు. విష్ణువర్థన్ రెడ్డి ఎంపీ అభ్యర్థి అయితే కావలితోపాటు కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో అతని ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. 

మరోవైపు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బొమ్మిరెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయని ప్రత్యేకించి ఆత్మకూరు నియోజకవర్గం మరింత బలపడుతోందన్నారు. 

ఎంపీగా అవకాశం ఇవ్వకపోతే ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అవకాశం ఇవ్వాలని పట్టుబట్టటారు. వీరితోపాటు డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి సైతం నెల్లూరు పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. వీరితోపాటు నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును కూడా పరిశీలనలో ఉంది. 

అయితే మాగుంట శ్రీనివాసులరెడ్డి మాత్రం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చెయ్యడంపై విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. ఇకపోతే అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే వెంకటగిరి నియోజకవర్గాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకే తిరిగి కేటాయించారు. అయితే వెంకటగిరి రాజాలతో సమన్వయం చేసుకోని నడవాలని చంద్రబాబు ఎమ్మెల్యేకి హితవు పలికారు. 

ఇకపోతే కోవూరు టికెట్ ను ప్రస్తుత ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులుకే కేటాయించారు. ఈ సీటుకు గట్టిపోటీ ఉంది.పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, గోవర్థన్‌రెడ్డిలు కోవూరు టికెట్ ఆశిస్తున్నారు. అయితే వారిని బుజ్జగించే బాధ్యతలను పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకూ అప్పగించారు చంద్రబాబు.  

ఇకపోతే ఉదయగిరి నియోజకవర్గం కూడా సిట్టింగ్ అభ్యర్థికే కేటాయించారు. బొల్లినేని రామారావు తిరిగి పోటీ చెయ్యనున్నారు. ఆత్మకూరు నుంచి బొల్లినేని కృష్ణయ్య, కావలి అభ్యర్థిగా బీద మస్తాన్‌రావు, గూడూరుకు పాశిం సునీల్‌ లను అభ్యర్థులుగా ప్రకటించారు.  

అయితే సూళ్లూరుపేట అసెంబ్లీ టికెట్ మాత్రం ప్రకటించలేదు. ఈ సీటుపై భిన్నాభిప్రాయాలు రావడంతో అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని వాయిదా వేశారు చంద్రబాబు. ఈ సీటును వేనాటి పరంధామరెడ్డి, వేనాటి సతీష్‌ రెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డిలు ఆశిస్తున్నారు. నాలుగు రోజుల్లో అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా
1. నెల్లూరు సిటీ ..............నారాయణ
2. నెల్లూరు రూరల్..........ఆదాల ప్రభాకార్ రెడ్డి
3. ఉదయగిరి....................బొల్లినేని రామారావు
4. ఆత్మకూరు....................బొల్లినేని కృష్ణయ్య
5. కావలి..............................బీద మస్తాన్ రావు
6. వెంకటగిరి......................కురుగొండ్ల రామకృష్ణ
7. కోవూరు...........................పోలంరెడ్డి శ్రీనివాసులు
8. గూడూరు........................పాశిం సునీల్
9. సర్వేపల్లి........................సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
10.సూళ్లూరుపేట................పెండింగ్ 

Follow Us:
Download App:
  • android
  • ios