ఎన్నికలు మరెంతో దూరంలో లేవు.  పార్టీ అధిష్టానాలు.. టికెట్ల పంపకాల విషయంలో కసరత్తు మొదలుపెట్టాయి. కొన్ని నియోజకవర్గాల్లో చాలా మంది ఆశావాహులు టికెట్ల కోసం పోటీపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్యకు టీడీపీ టికెట్ దక్కుతుందనే ప్రచారం ఊపందుకుంది.

పాలకొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి విషయంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కుమార్తె నిమ్మక స్వాతి అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకూ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న నిమ్మక జయకృష్ణ టిక్కెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ఆయన సోదరుడు నిమ్మక పాండురంగ భార్య బబిత కూడా తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

మరోవైపు విశాఖకు చెందిన బిల్డర్‌ కంపా హనోక్‌ కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు. శనివారం రాత్రి సీఎం చంద్రబాబు సమక్షంలో అరకు పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్షించారు. కానీ పాలకొండ విషయానికి వచ్చేసరికి అభ్యర్థి విషయంలో స్పష్టతకు రాలేకపోయారు. 

దీంతో మరోసారి దీనిపై సమీక్ష నిర్వహించి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. స్వాతికి టికెట్ కేటాయిస్తే మంచిదని పార్టీ అధిష్టానం భావిస్తోందట. స్వాతి ఫార్మసీ చదవగా.. ఆమె భర్త ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్నారు.