గుంటూరు: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి రెచ్చిపోయారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైసీపీ మేనిఫెస్టో చూస్తుంటే భయమేస్తోందన్నారు. 

వైసీపీ హామీలు అమలు చెయ్యాలంటే కనీసం రూ.3లక్షల కోట్లు కావాలన్నారు. వైసీపీలా తాము మోసపూరిత హామీలు ఇవ్వమని చెప్పుకొచ్చారు. నిజాయితీగా చెయ్యగలిగిన హామీలు మాత్రమే ఇస్తామని చెప్పుకొచ్చారు. 

మరోవైపు డేటా చోరీ వ్యవహారంపై పవన్ స్పందించారు. మీ రాజకీయాల కోసం తెలుగు ప్రజలను బలి చేయోద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేతులెత్తి మెుక్కారు. 

జనసేన పార్టీ ప్రశ్నించేందుకే పుట్టిందని అవినీతి పార్టీలపై ప్రశ్నించేందుకు జనసేన పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ వామపక్ష పార్టీలతో  కలిసి పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. ఏ ఇతర పార్టీలతో కలిసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.