కుటుంబం కోసం భర్త దేశం కానీ దేశంలో కష్టపడుతుంటే.. భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. చివరికి ప్రియుడు, ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించారు. వివరాల్లోకి వెళితే... కడపలోని చిన్న చౌకు ఎస్టీ కాలనీకి చెందిన సౌదగిరి శ్రావణ్ నగరంలోని ఓ జిమ్ సెంటర్‌లో బాడీ బిల్డింగ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు.

చింతకొమ్మదిన్నె మండలం పడిగెలపల్లికి చెందిన సుంకర సరస్వతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితు ఉపాధి నిమిత్తం భర్త కువైట్‌లో ఉంటున్నాడు. అయితే శ్రావణ్, సరస్వతిలకు గతంలోనే పరిచయం ఉంది.

తరచుగా మొబైల్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఓ రోజు శ్రావణ్ పడిగెలపల్లె పరిధిలోని గంగమ్మ జాతరకు వచ్చాడు. అక్కడి నుంచి సమీపంలోని సరస్వతి ఇంటికి వెళ్ళగా... ఆమె ఇంటి దూలానికి ఉరేసుకుని కొన ఊపిరితో ఉంది.

దీంతో ఆమెను రక్షించే ప్రయత్నం చేశాడు. వెంటనే బయటకు తీసుకొచ్చి తన బైక్‌పై వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు చుట్టుముట్టడంతో సరస్వతిని అక్కడే వదిలేసి పారిపోయాడు.

గ్రామస్తుల నుంచి తప్పించుకుని పారిపోతూ రిమ్స్ రోడ్డులోని వెంకటగారిపల్లె సమీపంలో తన బైక్‌తో సహా కాలిపోయాడు. శ్రావణ్ తనకు తానే పెట్రోలు పోసుకున్నాడా..? లేక ఎవరైనా అతనిని సజీవదహనం చేశారా.. అన్నది మిస్టరీగా మారింది.

ఘటనాస్థలంలో రెండు ఫోన్లు దొరకడంతో వాటి ఆధారంగా పోలీసులు కూపీ లాగుతున్నారు. వీరిద్దరి మరణానికి వివాహేతర సంబంధమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.