గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన బిగ్ షాట్  ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఆయన సోమవారం జరిగిన గుంటూరు జిల్లా నేతల సమావేశానికి గైర్హాజరయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇక సైకిల్ దిగేందుకు రెడీ అయ్యారు మోదుగుల. దీంతో బుధవారం సాయంత్రం వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో భేటీ కానున్నారని తెలుస్తోంది. 

నెల్లూరు జిల్లాలో వైసీపీ సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ ను సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. రాత్రికి వైఎస్ జగన్ ను కలిసి పార్టీలో చేరే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ పార్టీ అధ్యక్షులతో మోదుగుల సమావేశమయ్యారు. 

తెలుగుదేశం పార్టీలో తనకు జరిగిన అవమానాలను కార్యకర్తలతో చెప్పుకున్నారు. ఒకానొక సందర్భంలో మోదుగుల కన్నీటి పర్యంతమయ్యారు. తనను గౌరవించలేని పార్టీలో ఉండలేనని  కార్యకర్తలకు తేల్చి చెప్పారు. 

ప్రస్తుతం తనపై వస్తున్న ప్రచారాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తారేమోనని వేచి చూశానని అయితే చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. దాంతో తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని అందువల్లే పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. 

అనంతరం గుంటూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు మోదుగుల. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ ను కలవనున్నారని తెలుస్తోంది.  వైసీపీలో చేరే అంశంపై వైఎస్ జగన్ తో చర్చించనున్నారు.   

మోదుగుల రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్ అవకాశం లేకపోతే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వలేదు సరికదా కనీసం అభ్యర్థుల పేర్ల పరిశీలనలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరును కూడా తీసుకోలేదు. దీంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు.