కర్నూలు: ఎట్టకేలకు కేంద్రమాజీమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సైకిలెక్కేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

చంద్రబాబు నాయుడు కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ, తనయుడు రాఘవేంద్రారెడ్డిలకు కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. కర్నూలు జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల శంకుస్థాపనకు విచ్చేసిన చంద్రబాబు కోడుమూరు బహిరంగ సభలో పాల్గొన్నారు. 

కోట్ల దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సమయంలో పక్కన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డిలు ఉన్నారు. కోడుమూరు బహిరంగ సభలో చంద్రబాబు నాయడు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. 

కోడుమూరు బహిరంగ సభ ఏర్పాట్లను కోట్ల తనయుడు రాఘవేంద్రారెడ్డి పర్యవేక్షించడం విశేషం. ఇకపోతే రాబోయే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చెయ్యనున్నారు. అలాగే ఆలూరు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా కోట్ల సుజాతమ్మ పోటీ చెయ్యనున్నారు.