హైదరాబాద్: సినీ నటుడు నాగార్జున ఆ మధ్య వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై సినీ నటి జయసుధ స్పందించారు. కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉన్న సినీ నటి జయసుధ గురువారం వైసీపీలో చేరారు. 

హైదరాబాదులోని లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్‌, నాగార్జున భేటీపై చంద్రబాబు చేసిన విమర్శలపై జయసుధ స్పందించారు. 

జగన్ లాంటి వ్యక్తులను సినీ నటులు కలవడం దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మాటలు చంద్రబాబు మాట్లాడకూడదని, ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులంతా సినీ ఇండస్ట్రీ వాళ్లేనని జయసుధ చెప్పారు. 

సినీ నటులు ఎందుకు జగన్ ను కలవకూడదని ఆమె ప్రశ్నించారు. సినిమా వాళ్లంటూ తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదని, వాళ్లు కూడా ఈ దేశంలో ఓటర్లేనని జయసుధ అన్నారు.