భారత్-పాకిస్థాన్ మధ్య ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని తనకు రెండేళ్ళ క్రితమే తెలుసని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు బిజెపి నాయకులే తనతో ఈ  విషయం గురించి  చెప్పారని పవన్ బయటపెట్టారు. వారు చెప్పినట్లుగానే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొని వుందని పవన్ వెల్లడించారు. 

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ జనసేన పోరాట యాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కడప జిల్లాలో పర్యటన చేపట్టిన పవన్ భారత్-పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు.   

కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి కేవలం తమ పార్టీకి మాత్రమే దేశభక్తి వున్నట్లు ప్రవర్తిస్తోందన్నారు. వారి కంటే పదిరెట్లు ఎక్కువగా దేశభక్తి తమకుందని తెలిపారు. కానీ దాన్ని ప్రచారం కోసం వాడుకోబోమని పవన్ స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల కోసమే బిజెపి సరిహద్దుల్లో యుద్ద పరిస్థితులను సృష్టించారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

భారత దేశంలోని ముస్లిం సామాజిక వర్గం తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పాకిస్థాన్ లో హిందువుల పరిస్థితి ఎలా వుందో తెలీదు...కానీ భారత్ లో మాత్రం ముస్లింలను గుండెల్లో పెట్టుకుని చూస్తారన్నారు. భవిష్యత్ లో కూడా ముస్లింలకు అలాంటి స్థానమే వుంటుందని పవన్మ పేర్కొన్నారు.