త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఏపీలో బలమైన పార్టీ ఏది అంటే.. ముందుగా వినపడేది టీడీపీ, వైసీపీ ఈ రెండు పార్టీలే. టీడీపీ స్థాపించి 25ఏళ్లు పైనే అయ్యింది. కానీ.. వైసీపీ ని స్థాపించి కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. ఈ 9 సంత్సరాలలో.. రాష్ట్రంలో పార్టీకి గుర్తింపు తీసుకురావడానికి జగన్ చాలా కష్టపడ్డారు. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష పార్టీ హోదాలో వైసీపీ ఉంది. అంతేకాదు.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ  ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

కాగా.. ఈ పార్టీని స్థాపించి నేటికి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్... ట్విట్టర్ లో స్పెషల్ ట్వీట్ చేశారు. ‘మహానేత ఆశయాలను, పధకాలను సజీవంగా ఉంచేందుకు  వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. గత ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాలమీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, వందనాలు’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.

కాగా.. ఈ ట్వీట్ కి ప్రజల నుంచి స్పందన బాగుంది. ‘‘ఎన్నో ఆటుపోట్లు ఎదురైన అదరక బెదరక వెన్నుచూపక నిత్యం పోరాట స్పూర్తితో జనం పార్టీ గా అడుగులేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదోవ వసంతంలోకి అడుగు పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న #YSR కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ కొందరు పార్టీ అభిమానులు జగన్ ట్వీట్ కి కామెంట్స్ చేస్తున్నారు.