హైదరాబాద్: ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్‌‌ను సీఎం చేయడమే ధ్యేయంగా తాను పనిచేస్తానని సినీ  నటుడు అలీ ప్రకటించారు. స్నేహాం వేరు, రాజకీయాలు వేరని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్  అయితే తాను విజయం సాధించినట్టుగా భావిస్తానని ఆయన తెలిపారు. టీడీపీలో స్పష్టమైన హామీ లభించనందునే తాను వైసీపీలో చేరినట్టుగా  అలీ తేల్చి చెప్పారు.

సోమవారం నాడు హైద్రాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ సమక్షంలో అలీ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు. వైసీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్టు  అలీ చెప్పారు. 

వైసీపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయాలని  జగన్ తనను కోరారన్నారు. జగన్ సూచన  మేరకు తాను వైసీపీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తానన్నారు. పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తే తన భవిష్యత్తును జగన్ చూసుకొంటానని చెప్పారని ఆయన తెలిపారు.

2004 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌ను కలిసి మీరే ముఖ్యమంత్రి అవుతారని తాను చెప్పానని ఆయన గుర్తు చేసుకొన్నారు. నాడు వైఎస్ఆర్ పాదయాత్ర ప్రభావం ప్రజల్లో ఎలా ఉందో... ఇవాళ జగన్ పాదయాత్ర ప్రభావం కూడ ప్రజల్లో ఉందని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

గుంటూరు సిటీలోని ఓ స్థానం నుండి పోటీ చేసేందుకు టీడీపీ నుండి తనకు ఆఫర్ వచ్చిన విషయం వాస్తవమేనని అలీ చెప్పారు. అయితే  అదే సమయంలో స్థానికంగా ఉన్న తమను కాదని అలీకి టిక్కెట్టు కేటాయిస్తే ఊరుకోబోమని  స్థానిక నేతలు టీడీపీ చీఫ్‌ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

అంతేకాదు తనకు ఏ స్థానం నుండి సీటు ఇస్తారనే విషయమై కూడ స్పష్టత ఇవ్వాలలేదన్నారు. చూద్దాం, చేద్దాం అంటూ సాచివేత ధోరణిని అవలంభించారని తనకు నేనున్నాను అంటూ భరోసా కల్పించని కారణంగానే తాను వైసీపీలో చేరినట్టుగా అలీ ప్రకటించారు.

కొత్త సంవత్సరంలో చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌ను కలిసి  శుభాకాంక్షలు తెలిపినట్టుగా అలీ వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌తో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. స్నేహాం వేరు, రాజకీయాలు వేరన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ కావాలని తాను కోరుకొంటున్నట్టుగా ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ సక్సెస్ అయితే తాను సక్సెస్ అయినట్టుగానే భావిస్తానని అలీ ప్రకటించారు.