Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కసరత్తు: కనిగిరి సీటుకు నేతల కుస్తీ

ఒంగోలు జిల్లాలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నాడు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, సాయి కల్పనారెడ్డిలు కూడ  హాజరయ్యారు. వీరిద్దరూ కూడ త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. 

former mla ugra narasimha reddy meets chandrababunaidu
Author
on, First Published Feb 27, 2019, 1:42 PM IST

అమరావతి: ఒంగోలు జిల్లాలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నాడు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, సాయి కల్పనారెడ్డిలు కూడ  హాజరయ్యారు. వీరిద్దరూ కూడ త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. 

వైసీపీకి గట్టి పట్టున్న ప్రకాశం జిల్లాలో  ఆ పార్టీని దెబ్బతీయాలని చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు. జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను బాబు ఖరారు చేస్తున్నారు.

సోమవారం నాడు రాత్రి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నేతలతో చంద్రబాబునాయుడు అమరావతిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలతో చర్చించారు. 

ఒంగోలు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా చంద్రబాబు పూర్తి చేశారు. మరో నియోజకవర్గానికి అభ్యర్ధిని ఖరారు చేయాల్సి ఉంది. కనిగిరి, ఎర్రగొండ పాలెం, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మంగళవారం నాడు జరిగిన సమావేశానికి కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కూడ హాజరయ్యారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావుతో పాటు, ఉగ్ర నరసింహారెడ్డి కూడ హాజరయ్యారు. తొలుత వీరిద్దరూ కూడ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత వీరిద్దరిని గంటా శ్రీనివాసరావు సీఎం వద్దకు తీసుకెళ్లారు.

తాను టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో తనకు గుర్తింపు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇతర పార్టీల్లోని ఓట్లను కూడ తాను రాబట్టుకొంటానని చెప్పారు. పార్టీలో నా సేవలను ఎలా వినియోగించుకొంటారో మీ ఇష్టమని ఆయన చెప్పారు. అయితే అక్కడే ఉన్న ఎమ్మెల్యే కదిరి బాబురావు తాను మరోసారి పోటీ చేయాలనుకొంటున్నా... నాకు ఉగ్రను మద్దతివ్వాలని కోరారు. మరో వైపు ఉగ్రకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని బాబును కోరారు. 

ఎవరూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో, ఎవరూ ఎమ్మెల్సీగా ఉంటారనే విషయాన్ని మీరిద్దరూ తేల్చుకోవాలని చంద్రబాబునాయుడు సూచించారు. మీరిద్దరూ  ఒక నిర్ణయానికి రాకపోతే తాను నిర్ణయం తీసుకొంటానని బాబు స్పష్టం చేశారు. మరో వైపు పార్టీలో చేరేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉగ్ర నరసింహారెడ్డికి చంద్రబాబునాయుడు సూచించారు.

మరోవైపు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డి మంగళవారం నాడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. కొడుకు అభిషేక్‌రెడ్డితో కలిసి ఆమె బాబును కలిశారు. గిద్దలూరు వైసీపీ టిక్కెట్టును సాయి కల్పనా రెడ్డి ఆశించారు. కానీ, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును వైసీపీలో చేర్చుకోవడంతో ఆయనకే పార్టీ టిక్కెట్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో సాయి కల్పనారెడ్డి టీడీపీలో చేరాలని భావిస్తున్నారు. 

గతంలో సాయి కల్పనారెడ్డి భర్త మరణంతో చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న కాలంలో ఆమెను ఎమ్మెల్యేగా బరిలోకి దింపి  గెలిపించారు. 2009లో టీడీపీ టిక్కెట్టు దక్కని కారణంగా ఆమె పీఆర్‌పీలో చేరారు.ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు మళ్లీ ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు.

గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డికి సాయి కల్పనారెడ్డి కుటుంబం టీడీపీలో చేరే విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పారు. సాయి కల్పనారెడ్డి టీడీపీలో చేరితే తనకు అభ్యంతరం లేదని ఆశోక్ రెడ్డి ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తనను కలవాలని జగన్ నుండి సాయి కల్పనారెడ్డికి  సమాచారం అందినట్టుగా తెలుస్తోంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios