ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఉన్న అరా, కొర నేతలు కూడా ఇప్పుడు పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్లు.. కొందరు టీడీపీలోకి మరికొందరు వైసీపీలోకి.. ఈ రెండు కాదనుకుంటే జనసేనలో చేరిపోయారు. తాజాగా మరో నేత రెడీ అయిపోయాడు.

కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ని వీడాలని డిసైడ్ అయ్యారు. డీసీసీ పదవి విషయంలో రఘువీరా-బైరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. దీంతో బైరెడ్డి పార్టీని వీడాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇవాళ, రేపు తన అనుచరులు, ముఖ్య కార్తలతో చర్చించి ఎల్లుండి.. భైరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

పార్టీ వీడటం వరకు ఒకే.. కానీ తిరిగి ఏ పార్టీలో  చేరతారా..? అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. దాదాపు ఇప్పడు అన్ని పార్టీల్లోనూ అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యారు. ఈ సమయంలో బైరెడ్డి ఏదైనా పార్టీలో చేరితే టికెట్ దక్కే అవకాశం చాలా తక్కువ. మరి బైరెడ్డి  ఏ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.