రాజమహేంద్రవరం: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సెంటిమెంట్ జిల్లా తూర్పుగోదావరి. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. అంతేకాదు ఈ జిల్లాలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్. 

దీంతో ఈ జిల్లా అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. శుక్రవారం కాకినాడ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు నాయుడు శనివారం రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. రాజమహేంద్రవరం అభ్యర్థులపై కసరత్తు చేపట్టారు. 

రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చెయ్యనని ప్రస్తుత ఎంపీ మాగంటి మురళీమోహన్ స్పష్టం చెయ్యడంతో ఆ సీటును టీడీపీ నేత బొడ్డు భాస్కరరామారావుకు కేటాయించారు. ఈ సీటును టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ ఆశించారు. 

అయితే గెలుపుగుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న చంద్రబాబు నిర్ణయించుకోండంతో బొడ్డు భాస్కరరామారావును అభ్యర్థిగా ప్రకటించారు. ఇకపోతే రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థిగా మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రకటించారు. గత ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

రాజానగరం సీటును ప్రస్తుత ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కే కేటాయించారు. ఇకపోతే రాజమహేంద్రవరం అర్బన్ టికెట్ ఎవరికీ కేటాయించకుండా పెండింగ్ లో పెట్టారు. ఈ నియోజకవర్గం నుంచి ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఇద్దరు పేర్లను పరిగణలోకి తీసుకున్నారని తెలుస్తోంది. 

ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ది ఆర్యాపురం కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావుల పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ఆదిరెడ్డి అప్పారావు, చల్లా శంకర్రావులు తోడల్లుళ్లు కావడం విశేషం. అలాగే అనపర్తి, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ఎంపిక చెయ్యలేదు. 

ఇకపోతే గోపాలపురం నియోజకవర్గం నుంచి తిరిగి ప్రస్తుత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావునే ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతుంది. అలాగే అనపర్తి నియోజకవర్గం నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డినే తిరిగి పోటీ చేయించే యోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. 

అటు కొవ్వూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఆశావాహుల సంఖ్య విపరీతంగా ఉంది. అంతేకాదు నియోజకవర్గంలో టీడీపీలో అసంతృప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మరోసారి అభ్యర్థి ఎంపికపై చర్చించాలని సూచించినట్లు తెలుస్తోంది. కర్నూలులో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను వాయిదా వేశారు. కర్నూలు పర్యటన అనంతరం అభ్యర్థులను ఎంపిక చెయ్యనున్నట్లు తెలుస్తోంది.