గుంటూరు:  డేటా చోరీ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేస్తున్న ఈ డేటా చోరీ వివాదం ఇప్పుడు గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ మెట్టెక్కింది. ఏపీ టీడీపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంలోని కొంతమంది పోలీసులపై ఫిర్యాదు చేశారు. 

తమ కంపెనీల్లో సమాచారాన్ని తెలంగాణ పోలీసులు చోరీ చేశారని ఆరోపిస్తూ ఎస్పీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. వైసీపీకి లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వంలోని సీనియర్ పోలీస్ అధికారులు టీడీపీకి సంబంధించి సమాచారాన్ని తస్కరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వంలోని పోలీసులు సహకరించారని ఆరోపించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ సిఈవో అశోక్ లేని సమయంలో కార్యాలయానికి మఫ్టీ డ్రస్ లో వెళ్లి ఉద్యోగులను బెదిరించి సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకుని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

రెండు దశాబ్ధాల నుంచి సేకరించిన టీడీపీ సమాచారాన్ని దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్ 120బి, 418, 420,380, 409, 167, 177,182 రెడ్ విత్ 511 సెక్షన్ల కింద కేసు నమోదు చెయ్యాలని ఫిర్యాదు చేశారు.

ఫిబ్రవరి 23న పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై దాడులు చేశారని ఆ సమయంలో సిఈవో అశోక్, సిబ్బందిని బెదిరించి బలవంతంగా సమాచారాన్ని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల దాడులకు సంబంధించి సీసీ ఫుటేజ్, ఫోటోలను ఫిర్యాదుతోపాటు ఎస్పీకి అందజేశారు. 

ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు, పత్తిపాటి పుల్లారావు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. 

తెలుగుదేశం పార్టీ లెటర్ హేడ్ పై ఫిర్యాదు చెయ్యగా, మరో లెటర్ హేడ్ పై ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు చేసిన సోదాలకు సంబంధించి ఫోటోలను టీడీపీ లీగల్ సెల్ నేత, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు వివరించారు.