అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సంలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్టునే వైసీపీ నేతలు చదువుతున్నారంటూ విమర్శించారు. కేసీఆర్, జగన్‌ల జోడి కేటీఆర్ మాటల్లో మరోసారి బయటపడిందని లోకేష్ ధ్వజమెత్తారు. 

వైసీపీ ప్రొడక్షన్, టీఆర్ఎస్ డైరెక్షన్‌లో టీడీపీ సభ్యత్వం, సర్వే డేటా దొంగిలించారని ఆరోపించారు. డేటా చోరీ చరిత్ర మీది, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ తమది అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు కోర్టు చీవాట్లు పెట్టినా బుద్ది రాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అమెరికాలో పర్సు పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా? లేక హైదరాబాద్‌లో చేస్తారా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డేటా పోయిందని ఫిర్యాదు వస్తే, ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలని కూడా తెలియదా అంటూ ప్రశ్నించారు. 

అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడలేక ఆంధ్రప్రదేశ్‌లో బలహీనమైన ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ ఉండదు, ఆటలు సాగుతాయనేది టీఆర్ఎస్ కుట్ర అంటూ చెప్పుకొచ్చారు. 

జగన్ మోదీ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నేతగా జీతం కావాలి, పోలీసుల నుంచి రక్షణ కావాలి, ప్రజల ఓట్లు కావాలి.. కానీ ఏపీ పోలీసులు, డాక్టర్లు, అధికారులపై నమ్మకం ఉండదన్నారు. అందువల్లే తెలంగాణలో ఉంటూ, టీఆర్ఎస్ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని లోకేష్ ట్వీట్ చేశారు.