అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో వేగం పెంచారు. ఇప్పటికే పలు జిల్లాలలో అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు నాయుడు తాజాగా అనంతపురం జిల్లా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. 

అమరావతిలో బుధవారం సాయంత్రం హిందూపురం, అనంతపురం పార్లమెంట్ స్థానాలపై చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 14 అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు చంద్రబాబు. 

అయితే అత్యధిక శాతం సిట్టింగ్ లకే అవకాశం కల్పించారు. అయితే హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ తిరిగి పోటీ చేస్తుండగా, కదిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చాంద్ బాషా, శింగనమల ఎమ్మెల్యే యామిని బాలకు టికెట్లు అనుమానమేనని తెలుస్తోంది.

హిందూపురం పార్లమెంట్ పరిధిలో రాప్తాడు నియోజకవర్గం టికెట్ తిరిగి పరిటాల సునీతకే కేటాయించారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ మరోసారి పోటీ చెయ్యనున్నారని చంద్రబాబు ప్రకటించారు. అలాగే పెనుకొండ నియోజకవర్గం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారధికే కట్టబెట్టారు. 

కదిరి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే చాంద్ బాషా, కందికొండ ప్రసాద్ పేర్లను చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. ధర్మవరం వరదాపురం సూరి, పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె రఘునాథ్ రెడ్డికే చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేశారు. 

అయితే మడకశిర నియోజకవర్గాన్ని పెండింగ్ లో పెట్టారు. అటు అనంతపురం పార్లమెంట్  పరిధిలో విషయానికి వస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గం హనుమంతరాయ చౌదరి, అనంతపురం ప్రభాకర్ చౌదరి లేదా మునిరత్నం, శింగనమల నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు పేర్లు చంద్రబాబు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుత ఎమ్మెల్యే యామిని బాలతోపాటు బండారు శ్రావణి, మాజీమంత్రి శైలజానాథ్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గం టికెట్ మళ్లీ ప్రభాకర్ రెడ్డికే కేటాయించారు. 

గుంతకల్ విషయానికి వస్తే జితేందర్ గౌడ్ లేదా మధుసూదన్ గుప్తాలలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఉరవకొండ పయ్యావుల కేశవ్, రాయదుర్గం కాల్వ శ్రీనివాస్ లకు కేటాయించారు సీఎం చంద్రబాబు. 

అనంతపురం పార్లమెంట్ అభ్యర్థులు
1. అనంతపురం అర్బన్- ప్రభాకర్ చౌదరి/ మునిరత్నం
2. శింగనమల              -యామినిబాల/బండారు శ్రావణి/ శైలజానాథ్
3. తాడిపత్రి                 -జేసీ ప్రభాకర్ రెడ్డి
4. గుంతకల్                 -జితేందర్ గౌడ్/ మధుసూదన్ గుప్తా
5. ఉరవకొండ              -పయ్యావుల కేశవ్
6. రాయదుర్గం             - కాలువ శ్రీనివాసులు
7. కళ్యాణదుర్గం            -హనుమంతరాయచౌదరి

హిందూపురం పార్లమెంట్ అభ్యర్థుల వివరాలు
1. హిందూపురం   -నందమూరి బాలకృష్ణ
2. రాప్తాడు          -పరిటాల సునీత
3. కదిరి              -చాంద్ బాషా/కందికొండ ప్రసాద్
4.ధర్మవరం        -వరదాపురం సూరి
5.మడకశిర         -పెండింగ్
6.పెనుకొండ      -పార్థసారధి
7.పుట్టపర్తి          -పల్లె రఘునాథ్ రెడ్డి