ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ అధికార ప్రతినిధి యామినీ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన ఏడుగురుని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు ముఖాన్ని మార్ఫింగ్ చేసి.. ఆయనను కించపరిచే విధంగా ఫోటోలు షేర్ చేశారు. కాగా.. దీనిపై గుంటూరు జిల్లా టీడీపీ నేత, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఐటీ కోర్‌ పోలీసులతో కలిసి కొన్ని రోజులుగా విచారిస్తున్న గుంటూరు అరండల్ పోలీసులుపోస్టింగ్‌లు ఏ ఐపీ అడ్రస్‌ నుంచి వచ్చాయో కనుగొన్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు తనపై అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ కూడా అరండల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ రెండు కేసుల్లో పోలీసులు దాదాపు ఏడుగురిని అరెస్టు చేశారు. అయితే.. వీరిలో కొందరు తమ పార్టీకి చెందిన వారని, వారికి ఆ పోస్టింగ్‌లతో సంబంధం లేనందున వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అరండల్‌పేట పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టడం గమనార్హం.