Asianet News TeluguAsianet News Telugu

అలకవీడని బాబాయ్ : జగన్ వ్యాఖ్యలతో వైవీ సుబ్బారెడ్డి మరింత దూరం

రాజకీయాల్లో అలకలు, బుజ్జగింపులు సాధారణమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఆ కీలక నేత అలకబూనడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అలకపాన్పు వీడకపోవడంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 
 

YV Subba Reddy still keeps away from YS Jagan
Author
Amaravathi, First Published May 4, 2019, 3:16 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా ఉత్కంఠమాత్రం కొనసాగుతూనే ఉంది. అభ్యర్థుల గెలుపు ఓటములపై నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంటే అలకపాన్పు ఎక్కిన నేతలు ఇకనైనా అలక వీడతారా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

రాజకీయాల్లో అలకలు, బుజ్జగింపులు సాధారణమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఆ కీలక నేత అలకబూనడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అలకపాన్పు వీడకపోవడంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

వైఎస్ జగన్ కు చిన్నాన్న అయిన వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు జిల్లాలో అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడంతోపాటు ఇతర పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ లో కీలకంగా వ్యవహరించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి పేరు ఎలా వినబడుతుందో అలానే వైవీ సుబ్బారెడ్డి పేరు వినబడేది. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో జైలులో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలను తన భుజస్కందాలపై వేసుకున్న నేత. అంతేకాదు వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

జగన్ జైలు నుంచి విడుదలైన తర్వాత బాబాయ్ వైవీకి కీలక బాధ్యతలు అప్పగించారు. నెంబర్ 2 స్థానం కల్పించారు కూడా. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంతోపాటు 2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన వైవీ సుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు. 

ఉభయగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ను కాపాడటంలో చాలా సక్సెస్ అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఒంగోలు పార్లమెంట్ టికెట్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వడంతో వైవీ అలకబూనారు. 

ఎన్నికల్లో కూడా అంతగా క్రియాశీలకంగా వ్యవహరించలేదు. అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, అధినేత జగన్ కోసం చాలా కష్టపడ్డానని అయితే తనకు గుర్తింపు ఇవ్వకపోగా తనకే క్లాసులు పీకాడంటూ వైవీ తన అనూయుల వద్ద వాపోయారట. 

తనపై ఓడిపోయిన అభ్యర్థికి టికెట్ ఎందుకు ఇస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై జగన్ క్లాస్ పీకడంతో ఇక చేసేది లేక ఆయన ఇక పార్టీకి దూరంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఇకపోతే ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ జగన్ మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవిని ఇస్తానని బాహటంగా ప్రకటించారు. 

బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత కల్పించడం, తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అలిగిన వైవీ సుబ్బారెడ్డికి జగన్ ప్రకటనతో చిర్రెత్తుకొచ్చిందట. తెరవెనుక రాజకీయం చేస్తూ పార్టీకి సహకరిద్దామనుకుంటున్న తరుణంలో జగన్ ఇలా మంత్రి ఆఫర్ ఇవ్వడంతో ఆయన ఆవేశంతో రగిలిపోయారట.

జిల్లాలో తన హవాకు అడ్డుకట్ట వేసిన బావమరిది బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక చేసేది లేక ఆయన పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. అయితే ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగతున్నా ఆయన మాత్రం పట్టువీడటం లేదని తెలుస్తోంది. 

ఇటీవల జరిగిన జన్మదిన వేడుకల్లో సైతం పాల్గొనలేదని పార్టీ కార్యకర్తలతో సైతం టచ్ లో లేకుండాపోయారని తెలుస్తోంది. అయితే వైవీ సుబ్బారెడ్డి ఇంకెప్పుడు అలకవీడతారా అన్నది రాజకీయాల్లో చర్చజరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios