అమరావతి: తాను క్రైస్తవ మతం పుచ్చుకున్నట్లు సాగుతున్న ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డి క్రైస్తవ మతం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై ఆయన స్పందించారు. ఆయనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్ గా నియమించడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ ప్రచారం సాగింది. 
 
తాను హిందువు కాదనే వార్తలు అవాస్తవమని, కొందరు పనిగట్టుకుని ఇలాంటి పుకార్లు చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మవద్దని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తాను హిందువునేనని, తిరుమల శ్రీనివాసుడు తమ ఇష్టదైవమని ఆయన అన్నారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి తనకు ఎలాంటి బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని చెప్పారు. 

టీటీడీ చైర్మన్‌గా ఉండాలని జగన్ తనను ఆదేశించారని, దేవుడికి సేవ చేసే భాగ్యం కలిగించిందని అనుకుంటున్నానని ఆయన అన్నారు. టీటీడీ చైర్మన్ పదవి రావడం అదృష్టమని, తనకు శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం దక్కినట్లేనని ఆయన అన్నారు.. టీటీడీనే కాదు భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటానని ఆయన అన్నారు. 

సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ముఖ్యంగా స్వామివారి ఆస్తులు, ఆభరణాల అవకతవకలపై వాస్తవాలు రాబడుతామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని జగన్ అమలు చేస్తారని వైవీ అన్నారు.