జగన్‌తో వై.ఎస్. షర్మిల భేటీ: రాజారెడ్డి పెళ్లి పత్రిక అందజేత
తన కొడుకు రాజారెడ్డి పెళ్లి పత్రికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి వై.ఎస్. షర్మిల ఇవాళ అందించారు.
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో ఆమె సోదరి వై.ఎస్. షర్మిల బుధవారం నాడు సాయంత్రం భేటీ అయ్యారు. తన కొడుకు వై.ఎస్. రాజారెడ్డి వివాహాన్ని పురస్కరించుకొని పెళ్లి ఆహ్వాన పత్రికను వై.ఎస్. షర్మిల తన సోదరుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అందించారు.
కడప నుండి వై.ఎస్. షర్మిల ప్రత్యేక విమానంలో ఇవాళ సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లికి చేరుకున్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వై.ఎస్. షర్మిల జగన్ తో భేటీ అయ్యారు. వై.ఎస్. షర్మిలతో పాటు ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడ ఉన్నారు. తన కొడుకు వివాహన్ని పురస్కరించుకొని అందరికి ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి కదా అని ఆమె మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మీతో ఎవరెవరు చేరుతున్నారనే విషయమై ఆమె సమాధానం చెప్పలేదు. తనకు సమయం లేదు.. తనకు వెళ్లే అవకాశం ఇవ్వాలని ఆమె మీడియా ప్రతినిధులను కోరారు.
వై.ఎస్. షర్మిల తాను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీతో విబేధించి వై.ఎస్. జగన్ వైఎస్ఆర్‌సీపీని ఏర్పాటు చేసిన సమయంలో షర్మిల కూడ జగన్ తో ఉన్నారు. అయితే కొన్ని కారణాలతో తెలంగాణలో రాజకీయాలు చేసేందుకు వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేశారు. తాను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు వై.ఎస్. షర్మిల.
ఈ నెల 17వ తేదీన వై.ఎస్. రాజా రెడ్డికి, అట్లూరి ప్రియకు నిశ్చితార్థం జరగనుంది. వచ్చే నెల 18న రాజారెడ్డి,ప్రియకు వివాహం జరగనుంది. ఈ కార్యక్రమాలకు జగన్ ను వై.ఎస్. షర్మిల ఆహ్వానించినట్టుగా సమాచారం.