చిత్తూరు: మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి  వాహనంపై వైసీపీ నేతలు శుక్రవారం నాడు దాడికి దిగారు.

కిషోర్ కుమార్ రెడ్డి వాహనంతో పాటు మాజీ ఎమ్మెల్యే వాహనంపై కూడ వైసీపీ శ్రేణులు దాడికి దిగారు.కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై దాడి చోటు చేసుకొంది.జిల్లాలోని మదనపల్లె మండలం ఆంగల్లు వద్ద కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై వైసీపీ దాడికి దిగిందని  టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు కారణమైంది.

మదనపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వాహనంపై కూడ దుండగులు దాడికి దిగారు. సంఘటన స్థలంలోనే  కిషోర్ కుమార్ రెడ్డి , టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి నల్లారి కిషోర్ కుమార్ టీడీపీలో చేరాడు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశాడు.రాష్ట్ర విభజనతో కిషోర్ కుమార్ రెడ్డి గత ఎన్నికలకు ముందు టీడీపీ తీర్ధం పుచ్చుకొన్నారు.