ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాలకు జిల్లాల్ని క్లీన్ స్వీప్ చేసిన అధికార పార్టీ.. తాజాగా రాష్ట్రంలోని అతిపెద్దదైన విశాఖ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది.

మొత్తం 98 స్థానాలకు గాను 58 డివిజన్లలో వైసీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీ- 29, జనసేన-04, ఇతరులు-06 స్థానాల్లో గెలుపొందారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఏరియా విస్తరించి వున్న ప్రాంతాల్లో వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులు గెలుపొందడం విశేషం.

అయితే వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కోడలు గాజువాకలో ఓటమి పాలవ్వడం అధికార పార్టీకి షాకిచ్చింది. కాగా.. మొదట్నుంచి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో వైసీపీ జెండా ఎగరేయాలని పక్కా ప్లాన్‌తో వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తూ వెళ్లింది.

అందుకు తగ్గట్టుగానే కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుంచి వైసీపీ దూసుకెళ్లింది. ఇప్పటికే గుంటూరును కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్.. చివరికి విశాఖ కార్పొరేషన్‌ను దక్కించుకోవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక విజయవాడలోనూ అధికార పార్టీ ఆధిక్యంలో వుంది. 

కాగా.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా వైసీపీ హవా నడిచింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. 11 కార్పొరేషన్లలో 8 కార్పొరేషన్లను వైసీపీనే సొంతం చేసుకుందని తెలుస్తోంది.

మరోవైపు 75 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 69 కైవసం చేసుకుందని సమాచారం. టీడీపీ మాత్రం రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే గెలిచింది. ఇంకా కొన్ని చోట్ల ఫలితాలు రావాల్సి ఉంది.