ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ ఎన్ రాజు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.  

ఉండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో పీవీఎల్ ఎన్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ పిలిపించి పోటీ చేయాలని కోరితేనే తాను బరిలోకి దిగానని చెప్పుకొచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఓడిపోయినట్లు వ్యాఖ్యానించారు.   

అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోయినా పొద్దున్నే క్యారియర్‌ తెచ్చుకొని మరీ సాయంత్రం వరకు నియోజకవర్గంలో ఉండి పార్టీ కోసం పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గం సమస్యలు తీరుస్తున్నట్లు చెప్పుకొచ్చారు.  

అంతేకాదు ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌ నుంచి తాను రూపాయి కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఉండి పక్క నియోజకవర్గాలకు రూ.15 కోట్లు చొప్పున జగన్‌ ఇచ్చారని తాను మాత్రం డబ్బులు తీసుకోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తాను పార్టీ కోసం, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పీవీఎల్ ఎన్ రాజు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పీవీఎల్ ఎన్ రాజు వ్యాఖ్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. 

ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసిందని ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పదేపదే ఆరోపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.