వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తన ఆస్తిపై కన్నేసి కబ్జా చేయడానికి దౌర్జన్యం చేస్తున్నాడని ఓ బాధితుడు ఆందోళన వ్యక్తం చేసాడు.
వినుకొండ : వైసిపి శ్రేణులు తన ఇంటిపై దాడిచేసి కూల్చేసారని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ బాధితుడు ఆరోపించాడు. ఒకేసారి 150 మంది వైసిపి నాయకులు ఇంటిపైకి దాడికి వచ్చారని... తమను కొట్టడమే కాదు చంపేస్తామని బెదిరించారని బాధితుడు తెలిపాడు. స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తన స్థలాన్ని కబ్జా చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డారని... తనకు న్యాయం చేయాలని బాధితుడు అధికారులను కోరుతున్నాడు.
వినుకొండ పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో కామ వెంకటేశ్వర్లు శశి ధరణి స్వీట్స్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అక్కడే అతడి ఇళ్ళు కూడా వుంది. అయితే తన స్థలంపై స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కన్నేసాడని... దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వెంకటేశ్వర్లు ఆరోపించాడు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, వినుకొండ వైసిపి అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ఆధ్వర్యంలో 150 మంది తన ఇంటిపై దాడి చేసారని వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేసాడు.
వీడియో
వైసిపి శ్రేణుల దాడిలో స్వీట్ షాప్ తో పాటు ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యిందని... దాదాపు రూ.25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేసాడు. అంతేకాదు ఈ దాడితో తనతో పాటు కుటుంబసభ్యులు కూడా గాయపడ్డారని పేర్కొన్నాడు. తన ఆస్తులను ధ్వంసం చేసి నష్టపర్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని... లేదంటే ఈ అధికారులతో పాటు దాడిచేసిన వారిని శిక్షించాలని కోర్టును ఆశ్రయిస్తానని వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
కోర్టు వివాదంలో వున్న స్థలాలు, నిర్మాణాల విషయంలో అధికారులు న్యాయస్థానం ఆదేశాలను పాటించాలి... కానీ అధికారుల ప్రమేయమే లేకుండా వైసిపి నాయకులే కూల్చివేతలకు దిగారని బాధితుడు ఆరోపించారు. తన అంతు చూస్తానని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు బెదిరించారని... ఆయన ఆదేశాలతోనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వైసిపి నాయకులు, ఎమ్మెల్యే అనుచరులు ఆస్తులను ధ్వంసం చేసారని బాధితుడు తెలిపాడు. పోలీసులు కూడా ఎమ్మెల్యేకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని... ఉన్నతాధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని వెంకటేశ్వర్లు కోరాడు.
