Asianet News TeluguAsianet News Telugu

ఆ టీడీపీ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొడతారా .. ఆయన్ని ఓడించడానికి వైసీపీ వ్యూహమేంటీ..?

ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన కొండపి ఒకప్పుడు పెద్దగా వార్తల్లో వుండేది కాదు. కానీ 2014, 2019లలో డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి వరుస విజయాలతో పాటు ప్రభుత్వంపై పోరాటంతో కొండపి రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకుంది. 
 

ysrcp strategy against dola bala veeranjaneya swamy in kondapi assembly constituency ksp
Author
First Published Jan 13, 2024, 4:29 PM IST

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుపొందే నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్‌లో చాలానే వున్నాయి. దశాబ్ధాలుగా టీడీపీకి ఆ స్థానాలు కంచుకోటలుగా మారాయి. ఆ సెగ్మెంట్లపై ఎలాంటి టెన్షన్ పడకుండా మిగిలిన చోట్లపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. అలాంటి వాటిలో ఒకటి ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం . 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గం తొలుత కాంగ్రెస్‌కు కంచుకోటగా వుండగా.. టీడీపీ ఆవిర్భావం తర్వాత అండగా వుంటూ వస్తోంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన కొండపి ఒకప్పుడు పెద్దగా వార్తల్లో వుండేది కాదు. కానీ 2014, 2019లలో డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి వరుస విజయాలతో పాటు ప్రభుత్వంపై పోరాటంతో కొండపి రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకుంది. 

టీడీపీ హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించారు. కుళాయిలు, రోడ్లు, యువతకు ఉపాధి, విదేశీ విద్యా దీవెన పథకం కింద ఎస్సీల్లో పేదలైన విద్యార్ధులకు ఉన్నత విద్యను అందుకునేలా చేశారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం సృష్టించినా కొండపిలో టీడీపీ గెలిచిందంటే అందుకు వీరాంజనేయస్వామే కారణం. రాష్ట్రంలోని 29 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో 28 చోట్ల వైసీపీ గెలిచినా , కొండపిలో మాత్రం టీడీపీ జెండా పాతింది. అప్పుడు కనుక తెలుగుదేశం అధికారంలోకి వచ్చుంటే ఆయన మంత్రి అయ్యేవారని టాక్. విపక్షంలో వున్నప్పటికీ వీరాంజనేయస్వామి నిత్యం ప్రజల్లోనే వుంటూ, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించారు. 

ఈ సారి కొండపిలో ఎలాగైనా గెలవాలని నిర్ణయించిన వైసీపీ అధిష్టానం తన వ్యూహం మార్చింది. ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ను తీసుకొచ్చి ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. అలాగే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, నిధులు మంజూరు చేయిస్తోంది. మంత్రి సైతం ఇక్కడి క్యాడర్‌తో సమావేశమవుతూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.

ఈ క్రమంలో కొండపిలో ఆసక్తికర పోరు నెలకొంది. నియోజకవర్గంలో సింగరాయకొండ, కొండపి, టంగుటూరు, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాలు ఉన్నాయి. వీటిలో కొండపీ, జరుమల్లి, టంగుటూరు మండలాలు టీడీపీకి పట్టున్న ప్రాంతాలు. పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లో వైసీపీకి పట్టు ఉన్నా.. దీనిపై ఆ పార్టీ ఆశ పెట్టుకుంటే కష్టమే. సింగరాయకొండ మండలం మాత్రం పరిస్థితులకు అనుగుణంగా వైసీపీ, టీడీపీ వైపు నిలుస్తూ అంతిమ విజేతను నిర్ణయిస్తోంది. 

వైసీపీ విషయానికి వస్తే మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఇక్కడికి పంపినప్పటికీ పార్టీలో ఆయనకు సహకరించేవారు ఎవరన్నది చూడాలి. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాదాసి వెంకయ్య స్వామి వర్గానికి, నిన్న మొన్నటి వరకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన వరికూటి అశోక్ బాబు వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి వుంది. వీరందరిని సమన్వయం చేసుకుంటూ మంత్రి సురేష్ పని చేసుకుంటూ పోవాల్సి వుంటుంది. 

ఇక టీడీపీ విషయానికి వస్తే.. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో కాస్త స్లో అయినప్పటికీ ప్రస్తుతం పరిస్ధితులు సెట్ కావడంతో స్థానిక కేడర్ సైతం యాక్టీవ్ అవుతోంది. దీంతో వరుస కార్యక్రమాలతో తెలుగుదేశం దేశం మంచి జోష్‌లో వుంది. సిట్టింగ్‌లందరికీ టికెట్లు కేటాయిస్తానని చంద్రబాబు చెప్పడంతో డోలా వీరాంజనేయస్వామికి ఎలాంటి ఢోకా లేదు. హైకమాండ్ ఆశీస్సులతో పాటు స్థానిక నాయకత్వం కూడా ఆయన వెంట నడిస్తే మరోసారి వీరాంజనేయస్వామి విజయం ఖాయమనే విశ్లేషణలు వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios