హైదరాబాద్‌ : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతోమాట్లాడిన బొత్స పవన్ మానసిక స్థితి బాగోలేదని విమర్శించారు.  

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడో ఎవరికీ అర్ధంకాదని ఆయనకు అయినా అర్థమవుతుందో లేదో తెలుసుకోవాలన్నారు. పవన్‌ మాట్లాడిన ప్రతి మాటకి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

రాజకీయ పరిపక్వత లేనివాళ్లు పవన్‌లా మాట్లాడుతారని, రాజకీయమంటే సినిమా డైలాగులు చెప్పినట్లు కాదని హితవు పలికారు. పవన్ నాపై అనసవరంగావ మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. తనపై పవన్ మాట్లాడిన ప్రతీ మాటకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైనా బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని బొత్స ఆరోపించారు. కేసీఆర్‌ని టీడీపీ నెత్తినపెట్టుకోవాలని చూసిందని, చంద్రబాబును కేసీఆర్‌ గతంలోనే శిక్షించి ఉంటే నేడు పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కేసీఆర్‌తో చంద్రబాబు లాలూచీ పడ్డారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ విజయవాడ వచ్చినప్పుడు ఆయన కోసం ఏపీ మంత్రులు ఎందుకు క్యూ కట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ​ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని మండిపడ్డారు. 

పక్క రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవడానికి కారణం తానేనని ప్రకటించుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లగడపాటి ఒక బ్యాంక్‌ కరప్ట్‌ అని, చంద్రబాబు తన సీఎం కుర్చీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని బొత్స ఆరోపించారు.