వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది నమ్మశక్యంగా లేదని.. ఒకేసారి రెండు టైర్లు ఎలా పేల్తాయని ఆయన ప్రశ్నించారు. 

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (ys jagan) తల్లి వైఎస్ విజయమ్మ (ys vijayamma) ప్రయాణిస్తున్న కారు నిన్న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కర్నూలు వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలిపోయాయి. అయితే ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (raghu rama krishnam raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే తాను ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశానని ఆయన చెప్పారు. విజయమ్మ ప్రయాణించిన కారు కేవలం 3,500 కిలోమీటర్లు మాత్రమే తిరిగి వుంటుందని.. ట్యూబ్ లెస్ టైర్స్ రెండూ ఒకేసారి పేలవని రఘురామ అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ముఖ్యమంత్రి ఎప్పుడూ దుష్ట చతుష్టయం అంటుంటారని.. దీని వెనుక ఏదో కుట్ర ఖచ్చితంగా వుందని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALso REad:తప్పిన ప్రమాదం: వైఎస్ విజయమ్మ కారుకు ప్రమాదం, సురక్షితంగా బయటపడిన విజయమ్మ

కాగా.. అనంతపురంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న విజయమ్మ.. హైదరాబాద్ తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో కర్నూలుకు వెళ్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. విజయమ్మ ప్రయాణిస్తున్న వాహనం ఎడమవైపు రెండు టైర్లు పేలాయి. డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. టైర్లను మార్పించిన అనంతరం విజయమ్మ కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు.