ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. కేంద్రంపై జగన్ చేస్తున్నది తమలపాకు యుద్ధమని , మూడేళ్ల నుంచి ఇలాగే చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్‌పై (ys jagan) విమర్శలు గుప్పించారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (raghu rama krishnam raju). గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నానని సీఎం అంటున్నారని, మరి ఆయన సీరియస్‌గా యుద్ధం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్రంపై వైసీపీ చేస్తున్నది తమలపాకు యుద్ధమని.. మూడేళ్ల నుంచి ఈ యుద్ధం చేస్తున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. యుద్ధం చేసేవాళ్లు కనిపిస్తేనే కాళ్లు పట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో తనపై అనర్హత వేటు వేయాలనే బ్యానర్ తప్పించి.. ఇంకో ఫ్లకార్డ్ పట్టుకున్నారా అంటూ రఘురామ చురకలు వేశారు. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తమ పార్టీ వైఖరి వుందని రఘురామ కృష్ణంరాజు దుయ్యబట్టారు.
కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం తిరుమలాపురం, నార్లవరంలలో గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్ వరద బాధితులతో మాట్లాడారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహాయం చేయక తప్పదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి ఇంకా రూ. 2900 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామన్నారు. ప్రతి నెల కేంద్ర మంత్రులతో, అధికారులతో నిధుల విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతున్నారని జగన్ చెప్పారు.
ALso Read:సహాయం చేయక తప్పదు, మోడీ అపాయింట్ మెంట్ కోరా: పోలవరంపై జగన్
రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 500 ,రూ. 1000 కోట్లు అయితే పోలవరం పునరావాసం ఖర్చు చేసే వాళ్లమని సీఎం వ్యాఖ్యానించారు. పునరావాస ప్యాకేజీ కోసం జగన్ కూడా సరిపోవడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయమై తాను కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టుగా సీఎం జగన్ గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిధుల విషయమై కేంద్రంలో అంత స్థాయిలో కదలిక రావడం లేదని సీఎం జగన్ అంగీకరించారు. ఆలస్యం జరిగిన కొద్దీ కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టమేనని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టులో పునరావాస ప్యాకేజీకి రూ. 22 వేల కోట్లు అవసరమౌతాయన్నారు. పోలవరం ప్రాజెక్టులో 41 అడుగుల నీటిని నింపడానికి ముందే ముంపు బాధితులకు పరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయమై ఇప్పటికే మూడు సార్లు ప్రధానితో చర్చించినట్టుగా చెప్పారు. మరోసారి ప్రధాని అపాయింట్ మెంట్‌ను కోరినట్టుగా జగన్ చెప్పారు. Flood ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పనిచేసిందని సీఎం జగన్ ప్రశంసించారు. ఇంత పారదర్శకంగా గతంలో ఎప్పుడూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయం అందలేదని సీఎం జగన్ గుర్తుచేశారు.
