Asianet News TeluguAsianet News Telugu

గుర్తుపెట్టుకో! ఎల్ల‌కాలం ఇదే మాదిరిగా సాగదు.. రచ్చరచ్చ చేసిన జగన్

‘‘వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద‌గ్గ‌ర నుంచి పేప‌ర్లు లాక్కొని ఇష్టారీతిగా చింపే అధికారం ఎవ‌రిచ్చారు. మ‌ధుసూద‌న్ రావు గుర్తుపెట్టుకో.. ఎల్ల‌కాలం ఇదే మాదిరిగా ఉండ‌దు.’’

YSRCP protests during assembly meetings.. Jagan wearing a black scarf GVR
Author
First Published Jul 22, 2024, 1:07 PM IST | Last Updated Jul 22, 2024, 1:07 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆట‌విక పాల‌న‌ సాగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేప‌థ్యంలో తొలిరోజు వైఎస్ఆర్సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులంతా న‌ల్ల కండువాలు ధ‌రించి అసెంబ్లీకి వెళ్లారు. గ‌త 45 రోజులుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న హ‌త్య‌లు, అత్యాచారాలు, విధ్వంసాల‌పై ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ ‘సేవ్ డెమోక్ర‌సీ’ నినాదాల‌తో అసెంబ్లీ గేట్ వ‌ద్ద‌కు చేరుకోగా.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కుని చింపేశారు. 

YSRCP protests during assembly meetings.. Jagan wearing a black scarf GVR

ఈ సందర్భంగా పోలీసులపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పేప‌ర్లు చింపేసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగద‌ని, ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే కానీ, యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కాదన్నారు. ‘‘వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద‌గ్గ‌ర నుంచి పేప‌ర్లు లాక్కొని ఇష్టారీతిగా చింపే అధికారం ఎవ‌రిచ్చారు. మ‌ధుసూద‌న్ రావు గుర్తుపెట్టుకో.. ఎల్ల‌కాలం ఇదే మాదిరిగా ఉండ‌దు. ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాం మ‌నం, మీ టోపీల‌ మీద ఉన్న సింహాల‌కు అర్థం అధికారంలో ఉన్న‌వారికి సెల్యూట్ కొట్ట‌డం కాదు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌టం కోసం మీరున్నార‌ని గుర్తుపెట్టుకోండి’’ అంటూ పోలీసు అధికారుల‌కు జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చారు. 


అటు, అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహార శైలిపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని, రాష్ట్రంలో అరాచ‌కాలు జరుగుతున్నాయని నినాదాలు చేశారు. అసెంబ్లీ గేట్ వ‌ద్ద న‌ల్ల కండువాలు ధ‌రించి ఫ్ల‌కార్డుల‌ ప్రదర్శించి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. 

అలా, నిరసన తెలియజేస్తూ.. అసెంబ్లీలోకి ప్రవేశించిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలోనూ నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్ర‌ప్రదేశ్‌లో హింసాత్మ‌క పాల‌న జ‌రుగుతోంద‌ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో గ‌ళం విప్పారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగ మొద‌లైన సమయంలోనూ ‘హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ’ అంటూ నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగించ‌డంతో నిరసనగా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios